అందెశ్రీ పాడెను మోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • ఘట్‌కేసర్‌లో ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
  • అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు
  • అందెశ్రీ లేకపోవడం తీరని లోటు అన్న ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివారులోని ఘట్‌కేసర్‌లో నిర్వహించారు. ఈ అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంతిమ యాత్రలో అందెశ్రీ పాడెను రేవంత్ రెడ్డి మోశారు.

తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందెశ్రీ అంత్యక్రియల అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.

వ్యక్తిగతంగా, తెలంగాణ సమాజానికి లోటు: రేవంత్ రెడ్డి

అందెశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు, తెలంగాణ సమాజానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రం గురించి అనేక విషయాలు ఆయనతో చర్చించినట్లు తెలిపారు. అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ'ను రాష్ట్రగీతంగా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందెశ్రీ ప్రతి మాట ప్రజా జీవితం నుంచి పుట్టుకు వచ్చిందని అన్నారు. ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిందని అన్నారు.

'జయ జయహే తెలంగాణ' గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని అన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడు ఆయన అని అన్నారు. ఆయన రచనలకు సంబంధించిన 'నిప్పులవాగు' పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని అన్నారు.


More Telugu News