ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. 500 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు

  • ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం
  • ఈ బృందంలో 500 మందికి పైగా అధికారులు, సిబ్బంది
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష
  • ఐబీ, ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ, స్పెషల్ సెల్ అధికారులతో సమగ్ర విచారణ
  • ఢిల్లీ, యూపీ, బీహార్, ముంబై నగరాల్లో హైఅలర్ట్ జారీ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణ కోసం 500 మందికి పైగా భద్రతా అధికారులతో ఒక భారీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్థానిక పోలీసు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నట్లు స‌మాచారం. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ, స్పెషల్ సీపీ స్థాయి వరకు అధికారులను ఇందులో భాగం చేశారు. ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించి దర్యాప్తును వేగవంతం చేశారు.

అమిత్ షా నివాసంలో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం 
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాతే హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఘటన జరిగిన సోమవారం రాత్రి అమిత్ షా స్వయంగా ఎర్రకోట వద్ద పేలుడు సంభవించిన ప్రాంతాన్ని సందర్శించి, అనంతరం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుప‌త్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

ఇదిలా ఉంటే.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జైషే మహ్మద్ (జేఈఎం), అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఒక అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠాను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. వారి నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రెండు అసాల్ట్ రైఫిళ్లు, పిస్టళ్లు, టైమర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. ఢిల్లీకి సమీపంలోనే ఇంత భారీగా పేలుడు పదార్థాలు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై నగరాల్లో హైఅలర్ట్
ఈ పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో ఎన్ఎస్‌జీ కమాండోలను మోహరించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ముంబై నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రతను పెంచారు. ఎన్ఐఏ, ఐబీ, ఢిల్లీ స్పెషల్ సెల్ సమన్వయంతో పనిచేయాలని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమిత్ షా అధికారులను ఆదేశించారు.


More Telugu News