హీరో కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. విడా వీఎక్స్‌2 గో

  • 70 కి.మీ. వేగంతో 100 కి.మీ. మైలేజీ
  • రిమూవబుల్‌ బ్యాటరీలతో అందుబాటులోకి..
  • ఎక్స్ షోరూం ధర రూ.1.02 లక్షలు
ద్విచక్ర వాహనాల తయారీలో పేరొందిన హీరో మోటోకార్ప్ మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడా బ్రాండ్ తో మార్కెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వీఎక్స్‌2 ప్లస్‌ వేరియంట్‌ లో మాత్రమే 3.4KWh బ్యాటరీ ఆప్షన్‌ లభిస్తోంది. తాజాగా 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌ తో వీఎక్స్‌2 గోను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.1.02 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించింది. ఈ నెల నుంచే డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ మోడల్‌ లో విడా వీఎక్స్‌2 గో 3.4kWh స్కూటర్ ను కొనుగోలు చేస్తే ధర రూ.60 వేలకు దిగి వస్తుంది. ఆ తర్వాత సబ్ స్క్రిప్షన్ ఫీజు కింద కిలోమీటరుకు 90 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. కాగా, ఈ స్కూటర్ లోని మోటార్‌ 6kW పవర్‌ను, 26 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చని తెలిపింది. అంతేకాకుండా, ఇది రిమూవబుల్‌ బ్యాటరీలతో వస్తుండడంతో ఛార్జింగ్ చేసుకోవడం సులభమని పేర్కొంది.


More Telugu News