భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు

  • భారత్, రష్యా మధ్య కీలక వలస ఒప్పందం
  • పుతిన్ భారత పర్యటనలో ఒప్పందంపై సంతకాలు
  • రష్యాలో భారతీయులకు వేలాది ఉద్యోగావకాశాలు
  • ఈ ఏడాది చివరి నాటికి 70,000 మందికి ఉద్యోగాలు
  • మోసాలను అరికట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యం
భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి భారత మానవ వనరులను ఆహ్వానిస్తోంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇప్పటికే రష్యాలో పనిచేస్తున్న భారతీయుల ప్రయోజనాలకు భద్రత లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారికంగా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అంచనా.

మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ ఒప్పందాన్ని స్వాగతించింది. ఇది ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఐబీఏ అధ్యక్షుడు సమ్మీ మనోజ్ కొత్వానీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం, చైతన్యం గల వర్క్‌ఫోర్స్ భారత్‌లో ఉంది. అదే సమయంలో రష్యా పారిశ్రామికంగా కీలక దశలో ఉంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనకరం. రష్యా అవసరాలు తీరడంతో పాటు, భారత నిపుణులకు గౌరవప్రదమైన, సురక్షితమైన ఉపాధి లభిస్తుంది" అని ఆయన వివరించారు.

గతంలో కొందరు భారతీయ పౌరులు నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందులు పడిన సంఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ఐబీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ఇరు దేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. రష్యాకు వెళ్లే కార్మికులకు అవగాహన, భాషా కార్యక్రమాలు నిర్వహించడం, నైతిక నియామక పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది.

అలాగే మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, రష్యాలోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ, అక్కడ పనిచేసే భారత పౌరుల సంక్షేమానికి, వారు సాఫీగా స్థిరపడటానికి పూర్తి సహకారం అందిస్తామని ఐబీఏ స్పష్టం చేసింది.


More Telugu News