అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ.. ఘనంగా భూమి పూజ

  • 12 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణం
  • భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ఎం.ఎస్.కె ప్రసాద్
  • స్థానిక క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో "ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ" ఏర్పాటు కానుంది. ఈ అకాడమీ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.కె ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మెరికల్లాంటి యువ క్రీడాకారులను దేశానికి అందించడమే లక్ష్యంగా ఈ అకాడమీని స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్రికెట్ అకాడమీని నిర్మించనున్నారు. ఇది కేవలం శిక్షణా కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి క్రీడా సముదాయంగా అభివృద్ధి చెందుతుందని ఎం.ఎస్.కె వివరించారు. ఈ అకాడమీ ద్వారా స్థానిక క్రికెటర్లలోని ప్రతిభను పెంపొందించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు. అమరావతిలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమీకృత క్యాంపస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ మైదానం, పలు ప్రాక్టీస్ గ్రౌండ్లు, అత్యాధునిక శిక్షణా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక నెట్లతో పాటు క్రీడాకారుల సామర్థ్యాన్ని విశ్లేషించే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇండోర్ ట్రైనింగ్ అకాడమీ దీని ప్రత్యేకత. క్రీడలతో పాటు విద్యకు ప్రాధాన్యతనిస్తూ అంతర్జాతీయ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ఇక్కడే నిర్మించనున్నారు. క్రీడాకారులు, సందర్శక జట్ల కోసం ప్రత్యేక వసతి, హాస్టల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. స్థానిక టోర్నమెంట్ల నిర్వహణ కోసం మినీ క్రికెట్ స్టేడియం, అత్యాధునిక జిమ్, ఫిజియోథెరపీ, పునరావాస కేంద్రాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. అమరావతిని ఒక క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో సీఆర్డీఏ ఈ అకాడమీ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది. 


More Telugu News