బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్

  • ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో వెంటిలెటర్ మీద ఉన్నారని వార్తలు
  • ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన అవసరం లేదన్న నటుడి టీమ్
  • ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించిన సన్నీ డియోల్ బృందం
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారంటూ వస్తున్న వార్తలను ఆయన బృందం ఖండించింది. ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారని, ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారనే వార్తలు అభిమానులను, సినీ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన బృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

శ్వాస సంబంధిత సమస్యతో ధర్మేంద్ర అక్టోబర్ 31న ఆసుపత్రికి వెళ్లారు. మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన ఆరోగ్యంపై పుకార్లు వచ్చాయి. ధర్మేంద్ర 89 ఏళ్ల వయస్సులోనూ నటిస్తుండటం విశేషమని, డిసెంబర్ 9న ఆయన 90వ వసంతంలోకి అడుగు పెడుతున్నారని ఆయన బృందం తెలిపింది.

ఈ ప్రచారాన్ని ఆయన కుమారుడు సన్నీడియోల్ బృందం కూడా తోసిపుచ్చింది. ధర్మేంద్ర కోలుకుంటున్నారని తెలిపింది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది.

ఇదిలా ఉండగా, డిసెంబర్ 25న ఆయన కీలక పాత్ర పోషించిన 'ఇక్కీస్' విడుదల కానుంది. చిన్న వయస్సులోనే పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్న సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ధర్మేంద్ర ఇందులో అరుణ్ తండ్రిగా నటిస్తున్నారు.


More Telugu News