ఆ నగదు అందకపోతే నిరాశవద్దు: మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ కీలక సందేశం

  • సిగ్గులేని వారు తమ ప్రమోషన్ కోసం మీ విజయాన్ని ఉపయోగించుకుంటారన్న గవాస్కర్
  • ఉచిత ప్రచారం కోసం అనేక బ్రాండ్లు, వ్యక్తులు తప్పుడు ప్రకటనలు చేస్తారన్న గవాస్కర్
  • 1983లో పురుషుల జట్టు కప్ సాధించినప్పుడు ఇలాంటి అనుభవం ఎదురైందని వెల్లడి
ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా ప్రకటించిన నగదు బహుమతులు అందకపోతే నిరాశ చెందవద్దని భారత మహిళా జట్టు సభ్యులకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సందేశం పంపాడు. తమ ప్రమోషన్ కోసం మీ విజయాన్ని వాడుకునే సిగ్గులేని వారి గురించి బాధపడవద్దని సూచించాడు.

ఉచిత ప్రచారం పొందడం కోసం అనేక బ్రాండ్లు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రకటనలు చేస్తారని ఆయన తెలిపాడు. 1983లో పురుషుల జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందని గుర్తు చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన మహిళా జట్టుకు ఐసీసీ నుంచి దాదాపు రూ.40 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించగా, ఆయా రాష్ట్రాలు కూడా నజరానాలు ప్రకటించాయి. జట్టులోని స్టార్ క్రికెటర్లతో కొన్ని బ్రాండ్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చినట్లుగా నగదు అందకపోతే నిరుత్సాహానికి గురికావొద్దని గవాస్కర్ సూచించాడు.

"ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు అమ్మాయిలకు ఒక హెచ్చరిక. వాగ్దానం చేసిన వాటిలో కొన్ని మీకు అందకపోతే దయచేసి నిరాశపడకండి. భారత్‌లో కొంతమంది ప్రకటనదారులు, బ్రాండ్లు, వ్యక్తులు ఉచితంగా ప్రచారం పొందడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. జట్టును అభినందిస్తూ పూర్తి పేజీ ప్రకటనలు కూడా ఇస్తారు. హోర్డింగ్‌లు పెడతారు. జట్టు, ఆటగాళ్ల వ్యక్తిగత స్పాన్సర్లు కాకుండా మిగిలినవారు తమ బ్రాండ్లను లేదా తమ గురించి ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప భారత క్రికెట్‌కు కీర్తిని తెచ్చే వారికి ఏమీ ఇవ్వరు" అని ఆయన పేర్కొన్నాడు.

1983లో ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కూడా చాలా వాగ్దానాలు చేశారని, అప్పట్లో మీడియా కవరేజీ కూడా అంతగా లేదని గుర్తు చేసుకున్నాడు. దాదాపు అవన్నీ ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదని తెలిపాడు. ఈ విషయంలో మీడియాను కూడా నిందించలేమని, ఎందుకంటే సిగ్గులేని వ్యక్తులు ఈ అంశాన్ని వినియోగించుకుంటున్నారని గ్రహించకుండా గొప్ప ప్రకటనలంటూ ప్రచారం చేశారని అన్నాడు.


More Telugu News