సినిమాను మించిన సీన్.. గురువుపై పగబట్టిన శిష్యుడు!

  • గురువుపై ఆరేళ్లుగా కక్ష పెంచుకున్న పూర్వ విద్యార్థి
  • విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • గతేడాది కత్తితో దాడి.. తాజాగా మరోసారి హత్యాయత్నం
  • స్కూల్లో మందలించడమే దాడికి కారణంగా వెల్లడి
  • నిందితుడికి మతిస్థిమితం లేదని పోలీసుల అనుమానం
సినిమాల్లో పగ, ప్రతీకారాల కథలను చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలో అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం తనను మందలించాడన్న కోపంతో ఓ పూర్వ విద్యార్థి తన గురువుపైనే కక్ష పెంచుకున్నాడు. పలుమార్లు దాడికి యత్నించి స్థానికంగా కలకలం సృష్టించాడు. రామభద్రాపురం మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
సువ్వాడ వెంకట అప్పలనాయుడు ప్రస్తుతం జుమ్మువలస ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన 2019లో కోట శిర్లాం యూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, అప్పుడు 8వ తరగతి చదువుతున్న వై. దిలీప్ అనే విద్యార్థిని చదువుపై శ్రద్ధ పెట్టాలని, ప్రవర్తన మార్చుకోవాలని సున్నితంగా మందలించారు. ఆ చిన్న విషయాన్ని దిలీప్ మనసులో పెట్టుకుని, అప్పలనాయుడిపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 4న అప్పలనాయుడిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఆ ఘటనలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దిలీప్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉపాధ్యాయుడిని బెదిరించడం కొనసాగించాడు.

తాజాగా రెండు రోజుల క్రితం హెడ్‌మాస్టర్ అప్పలనాయుడు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా దిలీప్ మరోసారి అడ్డగించి దాడికి ప్రయత్నించాడు. అయితే, స్థానికులు వెంటనే గమనించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం వారు అప్పలనాయుడికి తోడుగా వెళ్లి ఇంటి వద్ద దిగబెట్టారు. ఈ ఘటనపై బాధితుడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని అనుమానిస్తున్నామని, అతని తల్లిదండ్రులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


More Telugu News