రన్నింగ్ బస్సులో డ్రైవర్ కు గుండెపోటు.. మడికి హైవేపై ఘటన

  • తాను మరణిస్తూ 50 మందిని కాపాడిన బస్సు డ్రైవర్
  • రోడ్డు పక్కగా బస్సు ఆపి స్టీరింగ్ వీల్ పై తలవాల్చేసిన డ్రైవర్
  • అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘటన
విద్యార్థులను కాలేజీకి తీసుకువెళుతున్న బస్సులో డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలోనే గుండెపోటుకు గురై స్టీరింగ్ వీల్ పైనే ప్రాణాలు వదిలాడు. తన చివరి క్షణాలలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సుకు ప్రమాదం జరగకుండా చూశాడు. బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆపేశాడు. దీంతో బస్సులోని 50 మంది విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మడికి గ్రామానికి చెందిన డి. నారాయణరాజు రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం కొత్తపేట మండలం గంటి నుంచి విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు వెళ్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో వారి ప్రాణాలు కాపాడేందుకు నారాయణరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు.

బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆపేశాడు. స్టీరింగ్‌ పై తలవాల్చేసిన డ్రైవర్ పరిస్థితిని విద్యార్థులు గమనించి అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ వచ్చేలోపే నారాయణరాజు మరణించారు. బస్సు రన్నింగ్ లోనే డ్రైవర్ మరణించి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని, మరణించే ముందు డ్రైవర్ నారాయణరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల తాము క్షేమంగా ఉన్నామని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.


More Telugu News