అందెశ్రీ మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ స్పందన

  • ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
  • తెలుగు సాహిత్యానికి తీరని లోటని పేర్కొన్న చంద్రబాబు
  • అందెశ్రీ మరణం బాధాకరమన్న పవన్ కల్యాణ్
ప్రముఖ కవి, వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని అభివర్ణించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అందెశ్రీకి నివాళులు అర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ... "ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ అందెశ్రీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత అందెశ్రీ గారి మరణం బాధాకరం. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేయడం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. తెలంగాణ జానపదం, మాండలికంపై ఆయనకు ఉన్న పట్టు అసాధారణం. 'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు' వంటి గీతాలు సమాజంపై ఆయనకున్న అవగాహనకు నిదర్శనం. 'జయ జయహే తెలంగాణ' గీతం ద్వారా ఆయన తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని పవన్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా అందెశ్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అందెశ్రీ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని, తెలుగు సాహిత్యానికి ఇది తీరని లోటు అని ట్విట్టర్‌లో పేర్కొంటూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. 


More Telugu News