గోవిందా మంచి భర్త కాదు.. వచ్చే జన్మలో వద్దు: భార్య సునీత సంచలన వ్యాఖ్యలు

  • గోవిందా మంచి భర్త కాదని కుండబద్దలు కొట్టిన సునీత అహూజా 
  • వయసొచ్చాక కూడా తప్పులు పునరావృతం చేస్తే శోభనివ్వదని హితవు
  • స్టార్ హీరో భార్యగా ఉండటం చాలా కష్టమంటూ ఆవేదన 
  • కొంతకాలంగా వీరిద్దరి విడాకులపై రూమ‌ర్స్
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహూజా మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన భర్త గోవిందా మంచి భర్త కాదంటూ సునీత చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి.

ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మనిషి తనను తాను అదుపులో ఉంచుకోవాలి. యవ్వనంలో తప్పులు చేయడం సహజం. నేను చేశాను, గోవిందా కూడా చేశారు. కానీ, ఒక వయసు వచ్చాక కూడా అవే తప్పులు పునరావృతం చేస్తే అది శోభనివ్వదు. అందమైన కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నప్పుడు అసలు ఆ తప్పులు ఎందుకు చేయాలి?" అని ఆమె ప్రశ్నించారు.

ఒక స్టార్ హీరో భార్యగా ఉండటంలోని కష్టాలను వివరిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. "ఆయన ఒక హీరో. భార్యల కన్నా హీరోయిన్లతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఒక స్టార్ భార్యగా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి. గుండెను రాయి చేసుకోవాలి. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నాకు 38 ఏళ్ల వివాహ జీవితం పట్టింది. యవ్వనంలో ఈ విషయాలు నాకు తెలియలేదు" అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

గోవిందా ఒక మంచి కొడుకు, మంచి సోదరుడు అని, కానీ మంచి భర్త మాత్రం కాదని ఆమె తెలిపారు. అందుకే, వచ్చే జన్మలో ఆయన తనకు భర్తగా వద్దని స్పష్టం చేశారు. గతంలో గోవిందా ఎఫైర్ల గురించి అడిగినప్పుడు, "నేను కూడా విన్నాను. కానీ కళ్లారా చూసేంత వరకు ఏమీ చెప్పలేను. ఒక మరాఠీ నటి అని విన్నాను" అని సునీత వ్యాఖ్యానించారు.

కాగా, కొంత‌కాలంగా గోవిందా, సునీత విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సునీత విడాకుల నోటీసులు కూడా పంపారని ప్రచారం జరిగింది. అయితే, వినాయక చవితి సందర్భంగా ఇద్దరూ కలిసి మీడియాకు పోజులిచ్చి ఆ వార్తలను ఖండించారు. తమను ఎవరూ విడదీయలేరని సునీత ఆ సమయంలో చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో వీరి బంధంపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. గోవిందా, సునీతలకు 1987లో వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


More Telugu News