యూట్యూబ్ రేసులో తండ్రీకొడుకులు.. 35 గంటల్లోనే చిరు రికార్డును బ్రేక్ చేసిన చరణ్!

  • యూట్యూబ్‌లో తండ్రీకొడుకుల మధ్య ఆసక్తికర రికార్డుల పోటీ
  • మూడు వారాల్లో 50 మిలియన్ వ్యూస్ సాధించిన 'మీసాల పిల్ల' పాట 
  • ఆ రికార్డును 35 గంటల్లోనే బ్రేక్ చేసిన రామ్ చరణ్ 'చికిరి చికిరి' సాంగ్
  • బుచ్చిబాబు 'పెద్ది' చిత్రం నుంచి వచ్చిన పాట సంచలనం
  • సోషల్ మీడియాలో 'మెగా మ్యూజిక్ ఫెస్టివల్' అంటూ ఫ్యాన్స్ సంబరాలు
టాలీవుడ్‌లో ఇప్పుడు మెగా తండ్రీకొడుకుల మధ్య ఓ ఆసక్తికరమైన పోటీ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తమ కొత్త చిత్రాల పాటలతో యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తున్నారు. తాజాగా తండ్రి నెలకొల్పిన రికార్డును కొడుకు కేవలం గంటల వ్యవధిలో అధిగమించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

చిరంజీవి నటిస్తున్న ‘మనశంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ, మూడు వారాల వ్యవధిలో 50 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను అందుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం తెలుగులో లిరికల్ వీడియోగా విడుదలైన ఈ పాటపై అభిమానులు చేసిన రీల్స్, షార్ట్స్ బాగా వైరల్ అయ్యాయి.

యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘చికిరి చికిరి’
అయితే, ఈ రికార్డును రామ్ చరణ్ తన కొత్త పాటతో సునాయాసంగా బ్రేక్ చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ అనే ఫస్ట్ సింగిల్ సంచలనం సృష్టించింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట కేవలం 35 గంటల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో వీడియో సాంగ్‌గా విడుదలైన ఈ పాట, యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోల పాటలు ఒకదాని తర్వాత ఒకటి యూట్యూబ్‌ను షేక్ చేస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘ఇది మెగా మ్యూజిక్ ఫెస్టివల్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఈ ఆరోగ్యకరమైన పోటీ, వారి రాబోయే చిత్రాలపై అంచనాలను మరింత పెంచుతోంది.


More Telugu News