Japan Bears: జపాన్ లో ఎలుగుబంట్ల బెడద.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం

Japan Bears Army Deployed Due to Increased Attacks
  • అకిటా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ఎలుగుబంట్ల సంతతి
  • తరచూ మనుషులపై దాడులు చేస్తుండడంతో జనంలో ఆందోళన
  • ఎలుగుబంట్లను బంధించడానికి సైన్యాన్ని పంపించిన ప్రభుత్వం
జపాన్ లో ఇటీవలి కాలంలో ఎలుగుబంట్ల సంతతి విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా అకిటా రాష్ట్రంలో వీటి సంఖ్య బాగా పెరిగింది. దీంతో అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంట్లు ఆహారం కోసం తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడి చేయడం సాధారణంగా మారిపోయింది. గడిచిన ఆరు నెలల్లోనే వందకు పైగా దాడులు చోటుచేసుకున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనం భయాందోళనకు గురవుతుండడంతో ప్రభుత్వం స్పందించింది.

ఎలుగుబంట్లను పట్టుకునేందుకు, జనావాసాల్లోకి రాకుండా వాటిని అడ్డుకోవడానికి సైన్యాన్ని రంగంలోకి దించింది. వాతావరణ మార్పులతో ఆహార వనరుల కొరత, శీతాకాలంలోనూ వెచ్చని ఉష్ణోగ్రతలతో హైబర్‌నేషన్‌ (సుప్తావస్థ) ఆలస్యం కావడంతో భల్లూకాలు జనావాసాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వెళ్లడంతో అక్కడ పండ్ల చెట్లు, ఇతర చెట్లు విపరీతంగా పెరగడం కూడా వీటి సంచారం పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

6 నెలల్లో 13 మంది మృత్యువాత
కజనో పట్టణంలో ఎలుగుబంట్ల సంచారం ఇటీవల విపరీతంగా పెరిగింది. రైల్వే స్టేషన్లు, రిసార్టులు, సూపర్‌ మార్కెట్లతోపాటు పాఠశాలల్లోనూ నిత్యం తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏప్రిల్‌ నుంచి ఎలుగుబంట్ల దాడుల్లో 13 మంది చనిపోయారని, దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్
ఎలుగుబంట్లను పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. వాటిని బంధించడానికి వేటగాళ్లతో పాటు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఎలుగుబంట్లను బంధించేందుకు బోన్లను, వాటి కళేబరాలు తరలించడంలో సైనికులు సాయపడతారని రక్షణ శాఖ వెల్లడించింది. అయితే, వాటిని చంపేందుకు తుపాకులు మాత్రం ఉపయోగించరని స్పష్టం చేసింది.

రెండు ప్రావిన్సులలో కాల్పులకు ఓకే..
అకిటా, ఇవాటే ప్రావిన్సుల్లో ఎలుగుబంట్లపై కాల్పులు జరిపేందుకు ప్రభుత్వం సైన్యానికి అనుమతిచ్చింది. వేటగాళ్లు సరైన సమయంలో స్పందించలేని పరిస్థితుల్లో మాత్రమే కాల్పులు జరపాలని ఆదేశించింది. మరోవైపు, గిఫు ప్రావిన్సులో డ్రోన్ల సాయంతో వివిధ శబ్దాలను సృష్టిస్తూ ఎలుగుబంట్లను భయపెడుతున్నారు.

ఒక్క హెన్షూ ద్వీపంలోనే 42 వేల భల్లూకాలు..
అక్రమంగా వేటాడడం వల్ల గతంలో ఎలుగుబంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఎలుగుబంట్లను పరిరక్షించేందుకు 1990లలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ తర్వాత నుంచి వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్క హెన్షూ ద్వీపంలోనే ఏకంగా 42 వేల ఎలుగుబంట్లు ఉన్నట్లు సమాచారం. హొక్కైడో ద్వీపంలో ప్రస్తుతం 12 వేల వరకు ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా.
Japan Bears
Akita
Bear attacks Japan
Wildlife Japan
Animal control
Japanese Alps
Hibernation
Climate change
Gifu province
Honshu Island

More Telugu News