Nara Lokesh: ఎన్డీయేను గెలిపిస్తే బీహార్ సర్వతోముఖాభివృద్ధి.. బీహార్ ఓటర్లకు నారా లోకేశ్ విజ్ఞప్తి

Nara Lokesh Appeals to Bihar Voters to Elect NDA for Development
  • ఎన్డీయే కూటమి తరఫున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ మంత్రి
  • ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది.. బీహార్ లో అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక
  • నితీశ్ కుమార్ ప్రభుత్వం వచ్చాకే బీహార్ లో పెద్దఎత్తున అభివృద్ధి
  • వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర కీలకమైందని వ్యాఖ్య
  • పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేశ్
‘‘‘ఒక్క ఛాన్స్” పేరుతో 2019లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీకి అవకాశం ఇచ్చి తీవ్రంగా నష్టపోయారు.. ఆ ఒక్క ఛాన్స్ వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ఒక్క ఛాన్స్ వల్ల పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. మొత్తంగా ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు అదే పరిస్థితిని మీరు కొనితెచ్చుకోవద్దు. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో బీహార్ పాత్ర చాలా కీలకం. బీహార్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మరోమారు ఎన్డీయేను గెలిపించండి’ అంటూ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బీహార్ యువతకు విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే కూటమి తరఫున మంత్రి లోకేశ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆయన పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించారు.

‘‘ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నేను ఇక్కడకు రాలేదు. బాధ్యతాయుత భారతీయ పౌరుడిగా ఇక్కడకు వచ్చాను. బీహార్ లో జరగబోయే ఈ ఎన్నిక భారత రాజకీయాల్లో ఎంతో కీలకం. బీహార్ యువత మరోమారు ఎన్డీయేను ఎందుకు గెలిపించాలో చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. మూడు కారణాలతో ఇక్కడి ప్రజలు ఎన్డీయేను గెలిపించాలి” అని మంత్రి పేర్కొన్నారు. ఆ మూడు కారణాలు ఇవే..

లీడర్ షిప్ ట్రాక్ రికార్డు
స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన కోసం ఎన్డీయేను గెలిపించాలి. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రూపురేఖలు మార్చేశారు. బీహార్ లో నాని (నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్) నాయకత్వం ఉంది. ఏపీలో నరేంద్ర మోదీ, నాయుడు గారి నాయకత్వం ఉంది. విజన్, సమర్థతతో వారు పాలన చేస్తున్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర చాలా పెద్దది. బీహార్ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మోదీ లక్ష్యం. 

డబుల్ ఇంజన్ సర్కారు
బీహార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వాలు ఉండటం వల్ల కేంద్ర బడ్జెట్ లో భారీగా నిధులు లభిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సహకరిస్తోంది. కేంద్రం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యం ఉంటుంది. వివిధ పరిశ్రమలు రావడానికి కేంద్రం మద్దతు లభిస్తుంది. ఎన్డీయే ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉండటంతో పెద్దఎత్తున అభివృద్ధి సాధించడానికి ఆస్కారం కలుగుతుంది.

ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం
గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. బీహార్ లో జంగిల్ రాజ్ పాలన పోయి నితీశ్ కుమార్ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు బాగుండటంతో పాట్నా ఎంతో అభివృద్ధి సాధించిందని బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నినాదం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. 

ఆచరణ సాధ్యం కాని హామీలు నమ్మొద్దు
బీహార్ లో ఒక పార్టీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెబుతోందని, అలాంటి ఆచరణ సాధ్యంకాని హామీలను నమ్మొద్దంటూ బీహార్ యువతకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే భారత జాతి బలోపేతమవుతుందని అన్నారు. ఎన్డీయే భాగస్వామిగా డబుల్ ఇంజన్ సర్కారు వల్ల బీహార్, ఏపీలకు కేంద్రంనుంచి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయని మంత్రి లోకేశ్ చెప్పారు. కాగా, ఈ సమావేశంలో బీహార్ స్టేట్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంటు సభ్యులు సానా సతీష్, గంటి హరీశ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Bihar Elections
NDA
Andhra Pradesh
Nitish Kumar
Narendra Modi
Double Engine Sarkar
Bihar Development
AP Politics
Indian Politics

More Telugu News