Revanth Reddy: అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్ విధానాలను ఫాలో అవుతున్నాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Says Following Chandrababu YSR Policies for Telangana Growth
  • ఐటీ, ఫార్మా రంగాలను వారు ప్రోత్సహించారన్న ముఖ్యమంత్రి
  • ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు
  • ఐటీ రంగానికి పునాది వేసిన నేత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంభించిన విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి హయాంలో ఐటీ, ఫార్మా రంగాలకు విశేష ప్రాధాన్యం దక్కిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి వేసిన పునాది హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్‌ అభివృద్ధికి బాటలు వేశాయని రేవంత్ రెడ్డి చెప్పారు. నగరం నాలెడ్జ్‌ సిటీగా మారిందంటే కారణం గతంలో కాంగ్రెస్‌ సీఎంలు తీసుకున్న నిర్ణయాలేనని అన్నారు. అభివృద్ధిలోనే కాదు.. సంక్షేమంలోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తమ ముద్ర వేశారని వివరించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ కూడా కీలకంగా మారాయన్నారు.

గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయని చెప్పారు. దేశానికి వచ్చిన వాటిలో 70 శాతం నగరానికే వచ్చాయని, ప్రపంచాన్ని శాసించే చాలా సంస్థలు హైదరాబాద్‌ లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం జీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్‌ హబ్‌గా మారిందని గుర్తుచేశారు. 2004-2014 మధ్య అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్‌ అభివృద్ధికి పాటుపడ్డాయని రేవంత్‌ రెడ్డి తెలిపారు.
Revanth Reddy
Chandrababu Naidu
YS Rajasekhara Reddy
Telangana development
Hyderabad IT sector
Pharma industry
Congress party
Shamshabad Airport
ORR
Nedurumalli Janardhan Reddy

More Telugu News