పూణె భూ వివాదం.. డీల్ రద్దు చేయాలన్నా రూ.42 కోట్లు చెల్లించాల్సిందే!

  • ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కొడుకు కంపెనీ
  • విలువైన భూమిని అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవడంపై వివాదం
  • డీల్ రద్దు చేసుకుంటున్నట్లు అజిత్ పవార్ ప్రకటన
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కు చెందిన కంపెనీ పూణెలో కొనుగోలు చేసిన భూమిపై వివాదం రేగిన విషయం తెలిసిందే. సుమారు రూ.1800 కోట్ల విలువైన భూమిని రూ.300 కోట్లకే సొంతం చేసుకున్నారని, ఈ డీల్ కు సంబంధించి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు కూడా పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దీనిపై వివరణ ఇస్తూ.. అది ప్రభుత్వ భూమి అనే విషయం తన కుమారుడికి తెలియదని చెప్పారు. భూమి కొనుగోలుకు సంబంధించిన డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ డీల్ రద్దు చేయడానికీ పార్థ్ పవార్ కంపెనీ భారీగానే చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ల్యాండ్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటే పార్థ్ పవార్ కంపెనీ రూ.42 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

ఏంటీ భూ కుంభకోణం..
పూణేలోని ముంధ్వా ప్రాంతంలో ఉన్న సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమి (మహర్ వతన్ భూమి) ని అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కు చెందిన కంపెనీ కొనుగోలు చేసింది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి విలువ దాదాపు రూ.1800 కోట్లు. పార్థ్ కంపెనీ మాత్రం దీనిని రూ.300 కోట్లకే సొంతం చేసుకుంది. నిజానికి ‘మహర్ వతన్’ భూమి ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ భూములను అమ్మడం లేదా కొనడం సాధ్యం కాదు. దీంతో పార్థ్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని, విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.


More Telugu News