నన్ను కాపాడండి... మస్కట్ నుంచి ఏపీ మహిళ కన్నీటి వేడుకోలు

  • మస్కట్‌లో చిక్కుకున్న అనంతపురం జిల్లా మహిళ
  • చిత్రహింసలు పెడుతున్నారంటూ వీడియోలో కన్నీరు
  • భారత్ రావాలంటే రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్న ఏజెంట్
  • కాపాడాలంటూ సీఎం చంద్రబాబు, పవన్‌కు వేడుకోలు
  • మంత్రి లోకేశ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన సోదరి
ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన అనంతపురం జిల్లాకు చెందిన మహిళ ఒకరు, యజమానులు తనను చిత్రహింసలు పెడుతున్నారని, స్వదేశానికి రప్పించాలని కన్నీటితో వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను సహాయం కోరుతూ ఆమె పంపిన వీడియో సందేశం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.

గుంతకల్లు పట్టణానికి చెందిన జుబేదా అనే మహిళ తొమ్మిది నెలల క్రితం కడపకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఉపాధి కోసం మస్కట్ వెళ్లారు. తొలుత షార్జా తీసుకెళ్లిన ఏజెంట్, అక్కడి నుంచి ఆమెను మస్కట్‌కు పంపించాడు. కొద్ది రోజులు బాగానే చూసుకున్నా, ఆ తర్వాత నుంచి నరకం చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలూ ఇంటి పనులు చేయించుకుంటూ, అనారోగ్యంతో బాధపడుతున్నా కనికరించకుండా చిత్రహింసలు పెడుతున్నారని సెల్ఫీ వీడియోలో విలపించారు. స్వదేశానికి తిరిగి వెళ్లాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని ఏజెంట్ బెదిరిస్తున్నాడని ఆమె వాపోయారు.

ఈ నేపథ్యంలో, జుబేదా కుటుంబ సభ్యులు ఆమెను రక్షించాలని ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. నిన్న అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను జుబేదా సోదరి షబానా కలిశారు. తన సోదరి దీనస్థితిని వివరిస్తూ, ఆమెను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

వీడియోలో జుబేదా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, స్థానిక ఎమ్మెల్యే జయరామ్ పేర్లను ప్రస్తావిస్తూ, తనను ఈ నరకం నుంచి బయటపడేయాలని వేడుకోవడం పలువురిని కదిలిస్తోంది. 


More Telugu News