రేవంత్ రెడ్డి ఒత్తిడిలో ఉన్నారు.. ఓటమి భయం కనిపిస్తోంది: బీజేపీ ఎంపీ

  • కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై నిందలు వేస్తారా అని ఆగ్రహం
  • మీ స్నేహితుడు ఇంటికో ఉద్యోగమని ఇచ్చిన హామీ సాధ్యమైనా అని ప్రశ్న
  • పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు ఇచ్చే బహుమతి ఏమిటో చెప్పాలన్న లక్ష్మణ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే బీజేపీపై నిందలు వేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు.

ఇంటికో ఉద్యోగం అంటూ బీహార్‌లో మీ మిత్రుడు తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారని, ఏడు కోట్ల మంది ఉన్న ఆ రాష్ట్రంలో ఆ హామీ సాధ్యమేనా అని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు ఇచ్చే బహుమతి ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెట్టాపట్టాలు వేసుకుని అధికారాన్ని పంచుకున్నాయని ఆయన ఆరోపించారు. 20 శాతం ఓట్ల కోసం దిగజారి మాట్లాడితే 80 శాతం ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. పాముకు పాలు పోసి పెంచినట్లు పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి అవకాశమిస్తే ఈరోజు విషనాగులా తయారైందని ఆయన విమర్శించారు.


More Telugu News