రేవంత్ రెడ్డిలో భయం మొదలైంది: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి

  • ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతిన్నట్లు ఉందన్న జగదీశ్ రెడ్డి
  • ముఖ్యమంత్రిని చూసి సిగ్గే సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్య
  • హైదరాబాద్ అభివృద్ధి అజెండా పైనే జూబ్లీహిల్స్ లో ఓటు వేయబోతున్నారని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తన పదవికి గండం పొంచి ఉందనే భయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మొదలైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని అందుకే సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రిని చూసి సిగ్గే సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్యానించారు. నగరంలో నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి అదే కమాండ్ కంట్రోల్‌లో కూర్చొని తమపై నిఘా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్‌ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సచివాలయం అంశాలపై కమిషన్ వేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో ఎన్ని గదులు ఉన్నాయో చూడటానికి రావాలని సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధి అజెండా పైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్‌ను, సోనియా గాంధీని రేవంత్ రెడ్డే తిట్టారని ఆరోపించారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడతారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి చేసే తప్పులను చరిత్ర క్షమించదని అన్నారు.

రేవంత్ రెడ్డి తన నోటి దురుసుతనం కారణంగా బీహార్ నుంచి వెళ్లగొట్టే పరిస్థితి తెచ్చుకున్నారని అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు పదవుల్లో ఉన్నారు కాబట్టే వారిని బ్యాడ్ బ్రదర్స్ అని కేటీఆర్ అన్నారని వ్యాఖ్యానించారు. వారిద్దరూ మోదీ శిష్యులేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతను రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు.

మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి ఓటమి భయంతో చేసే పనుల్లో ఇదీ ఒకటని విమర్శించారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక డ్రగ్స్ సంబంధత నేరాలు ఎక్కువయ్యాయని అన్నారు. పోలీసు కమిషనర్లే నేరాల రేటు పెరిగిందని చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి భాషతో తెలంగాణ పరువు పోతోందని, ఇప్పటికైనా ఆయన తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.


More Telugu News