వేలాది నాటుకోళ్లు ఫ్రీగా దొరికితే ఎలా ఉంటుంది? .. హన్మకొండలో ఇదే జరిగింది.. ఎగబడిన జనం!

  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వింత ఘటన
  • రహదారిపై 2000కు పైగా నాటుకోళ్లు ప్రత్యక్షం
  • గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లినట్లు నిర్ధారణ 
  • సమీప పొలాల్లోకి వెళ్లడంతో గమనించిన రైతులు
  • పండగ చేసుకుంటున్న గ్రామస్థులు
మార్కెట్లో నాటుకోడి మాంసానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని ధర కూడా మటన్‌తో పోటీ పడుతుంటుంది. అలాంటిది వేల సంఖ్యలో నాటుకోళ్లు ఉచితంగా దొరికితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వింత ఘటనే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఏకంగా 2000కు పైగా నాటుకోళ్లు రోడ్డుపై ప్రత్యక్షమవడం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2000కు పైగా నాటుకోళ్లను వదిలి వెళ్లిపోయారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్న ఆ కోళ్లన్నీ సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లాయి. పొలాల్లో వేలాది కోళ్లు గుంపులుగా తిరుగుతుండటాన్ని గమనించిన రైతులు ఆశ్చర్యపోయారు. మొదట అవి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థంకాక ఆరా తీయగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు.

ఇక ఈ విషయం తెలియడంతో రైతులు వాటిని పట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకింది. దీంతో ఎల్కతుర్తి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కోళ్లను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. ఒక్కొక్కరూ తమకు దొరికినన్ని కోళ్లను పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. కొందరైతే రెండు, మూడు కోళ్లను పట్టుకుని సంతోషంగా వెనుదిరిగారు. దీంతో ఆ ప్రాంతమంతా కోళ్లను వేటాడే వారితో సందడిగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో కోళ్లను ఎవరు, ఎందుకు వదిలి వెళ్లారనేది మాత్రం మిస్టరీగా మారింది.


More Telugu News