కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురి మృతి

  • కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • పెళ్లి కారు టైరు పేలడంతో అదుపుతప్పి బీభత్సం
  • బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి దూసుకెళ్లిన వైనం
  • ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి
  • మరో ఏడుగురికి తీవ్ర గాయాలు.. వారిలో విద్యార్థులే అధికం
ఏపీలోని కాకినాడ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద వేగంగా వెళుతున్న ఓ పెళ్లి కారు అదుపుతప్పి బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. అన్నవరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి జగ్గంపేట వైపు వెళుతున్న కారు సోమవారం గ్రామం వద్దకు రాగానే ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, రోడ్డు పక్కన బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ఇతర ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. అలాగే అక్కడే ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను, ఓ రిక్షాను కూడా బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నుముట్టాయి.

ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News