విమానాల రాకపోకలు ఆలస్యం.. శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన

  • వియత్నాం వెళ్లాల్సిన విమానం తీవ్ర ఆలస్యం
  • శుక్రవారం రాత్రి నుంచి 200 మంది ప్రయాణికుల ఎదురుచూపులు
  • ముంబై, ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానాల రద్దు
విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వియత్నాం వెళ్లాల్సిన విమానం కోసం శుక్రవారం రాత్రి నుంచి ఎదురుచూస్తున్న దాదాపు 200 మంది ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందంటే అధికారుల నుంచి సరైన సమాధానమే రావడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానంతో పాటు ఢిల్లీ, ముంబై, శివమొగ్గ వెళ్లాల్సిన ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించడంపై మండిపడుతున్నారు. 
 
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, దాని ప్రభావం హైదరాబాద్ లోని విమానాశ్రయంపైనా పడిందని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని వివరించారు. 

అధికారుల సమాచారం ప్రకారం..
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో 6E051 విమానం, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఇండిగో 6E245 విమానం, హైదరాబాద్ నుంచి శివమొగ్గ వెళ్లాల్సిన ఇండిగో 6E51 సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆలస్యమవుతున్న విమానాలు..
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా 68 ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వియత్నాం ఎయిర్‌లైన్స్ వన్984 – సాంకేతిక లోపం వల్ల ఆలస్యమవుతోంది. సిబ్బంది ఆలస్యంగా రావడంతో హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో 6I532 విమానం ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎయిర్‌లైన్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ గొడవకు దిగారు.


More Telugu News