రైళ్లలో ప్రయాణికులే టార్గెట్.. మోస్ట్ వాంటెడ్ దొంగ తానేదార్ సింగ్ అరెస్ట్

  • నిందితుడి నుంచి 8 తులాల బంగారం, నగదు స్వాధీనం
  • ఇప్పటివరకు 62 కేసుల్లో నిందితుడిగా తానేదార్ సింగ్
  • యూపీకి చెందిన నిందితుడు వికారాబాద్‌లో నివాసం
  • గతంలో పోలీసులపై దాడి చేసి తప్పించుకున్న దొంగ
  • దొంగతనాలకు భార్య కూడా సహకరించినట్లు వెల్లడి
రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దశాబ్దాలుగా చోరీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ నేరగాడు తానేదార్ సింగ్‌ను సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 8 తులాల బంగారం, రూ. 3 వేల నగదు, ఒక కత్తి, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను రైల్వే ఎస్పీ చందన దీప్తి శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌కు చెందిన తానేదార్ సింగ్ మూడో తరగతి వరకే చదువుకున్నాడు. 2004లో పూణె రైల్వే స్టేషన్‌లో చిన్న చిన్న పనులు చేస్తూనే జేబు దొంగతనాలు మొదలుపెట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పూర్తిస్థాయి నేరగాడిగా మారాడు. వికారాబాద్‌లో నివాసం ఏర్పరుచుకుని, రాజస్థాన్‌కు చెందిన గుడ్డి దేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తానేదార్ చేసే నేరాలకు అతని భార్య కూడా సహకరించేదని పోలీసులు తెలిపారు.

తానేదార్ సింగ్‌ నేర చరిత్ర చాలా పెద్దది. 2007లో వికారాబాద్‌లో, ఆ తర్వాత 2012లో మహారాష్ట్రలో పలు కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చాక 2014లో ఇద్దరు అనుచరులతో కలిసి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసి తుపాకీతో బెదిరిస్తూ  రైళ్లలో దోపిడీలకు పాల్పడ్డాడు. 2019లో జీఆర్పీ పోలీసులు పట్టుకోబోగా, వారిపై బ్లేడ్‌తో దాడి చేసి తప్పించుకున్నాడు. 2021లో మహబూబ్‌నగర్ పోలీసుల కస్టడీ నుంచి కూడా పరారయ్యాడు. భార్యతో కలిసి గంజాయి సరఫరా చేస్తూ కూడా ఒకసారి పట్టుబడ్డాడు.

నిందితుడు భరత్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఉన్నాడన్న కచ్చితమైన సమాచారంతో పోలీసులు గురువారం అతడిని పట్టుకున్నారు. తానేదార్ సింగ్‌పై ఇప్పటివరకు మొత్తం 62 కేసులు ఉన్నాయని, ప్రయాణికులను బెదిరించిన ఘటనల్లో 13 కేసులు నమోదయ్యాయని ఎస్పీ చందన దీప్తి వివరించారు.


More Telugu News