ట్రోఫీ తీసుకోబోమన్న భారత్.. ఐసీసీ సమావేశంలో కీలక పరిణామం

  • ఆసియా కప్ 2025 ట్రోఫీపై భారత్-పాక్ మధ్య తీవ్ర వివాదం
  • పాక్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు సూర్యకుమార్ నిరాకరణ
  • విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన బీసీసీఐ
  • మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ఐసీసీ
  • ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వంలో కమిటీ
ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య తలెత్తిన ట్రోఫీ వివాదంలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి ఒక మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో వెల్ల‌డించింది. ఇరు బోర్డులతో సత్సంబంధాలు కలిగిన ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛీఫ్ అయిన మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించాడు. నఖ్వీ పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉండటం ఇందుకు కారణం. 

టెలికాం ఆసియా స్పోర్ట్ కథనం ప్రకారం ఏసీసీ అధ్యక్షుడిగా తానే ట్రోఫీని అందించాలని నఖ్వీ పట్టుబట్టారు. వివాదం తర్వాత ఈ నెల‌ 10న దుబాయ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని అందిస్తామని బీసీసీఐకి ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించి, విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలోనే జరిగిందని, ఇరు బోర్డుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి బోర్డులు ప్రయత్నించాయని సమాచారం. భారత్, పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచంలో కీలక సభ్యులని, వారి మధ్య సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని ఐసీసీ బోర్డు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.

సమావేశం సజావుగా జరుగుతుందని హామీ లభించిన తర్వాతే నఖ్వీ దుబాయ్ పర్యటనకు వచ్చారని తెలుస్తోంది. పాక్‌ సెనేట్‌లో కీలక రాజ్యాంగ సవరణపై జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో ఆయన ఐసీసీ భేటీకి హాజరైన‌ట్లు స‌మాచారం.


More Telugu News