పోలవరం - బనకచర్ల డీపీఆర్‌పై కీలక నిర్ణయం.. టెండర్లను ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్

  • అక్టోబర్ 11న డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించిన సర్కార్
  • ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు
  • తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో టెండర్ల రద్దుకు ప్రాధాన్యం
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపకల్పన కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై స్పష్టత రానప్పటికీ, ఒకవైపు రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తుండటం, మరోవైపు తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాల్లోకి వెళితే.. బనకచర్ల ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని భావించిన ఏపీ ప్రభుత్వం, డీపీఆర్ తయారీ కోసం అక్టోబర్ 11వ తేదీన టెండర్లను ఆహ్వానించింది. టెండర్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 31వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. అయితే, తాజాగా ఆ టెండర్లను పూర్తిగా రద్దు చేసింది. ఈ విషయం ఏపీ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ టెండర్ స్థితిలో 'క్యాన్సిల్' అని పేర్కొంది. అయితే, ప్రభుత్వం ఇంత వరకు దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తూ కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. మరోవైపు రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం వామపక్షాలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకే వెళ్లి టెండర్లను పిలిచింది. ఇప్పుడు అకస్మాత్తుగా టెండర్లను రద్దు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ టెండర్ల రద్దుకు అసలు కారణం ఏమిటనే దానిపై సందిగ్ధత నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? లేక డీపీఆర్ తయారీకి ఏ సంస్థ కూడా ఆసక్తి చూపలేదా అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 


More Telugu News