సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్ మోసం చేశారు: మంత్రి సీతక్క

  • కేటీఆర్, హరీశ్‌పై మంత్రి సీతక్క ఫైర్
  • ఓటమి భయంతోనే హరీశ్ రావు ప్రచారం చేస్తున్నారని విమర్శ
  • వైన్, మైన్, ల్యాండ్ మాఫియాలతో బీఆర్ఎస్ విధ్వంసం సృష్టించిందని ఆరోపణ
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరి హడావిడి చూస్తుంటే బీఆర్ఎస్‌కు ఓటమి ఖాయమని అర్థమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె, కేటీఆర్, హరీశ్ రావుల తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ తన సొంత చెల్లితో పాటు మాగంటి తల్లిని కూడా మోసం చేశారని సీతక్క ఆరోపించారు. "మాగంటి తల్లి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో స్పష్టమవుతోంది. 91 ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా ఆమెను అవమానపరిచారు. ఈ ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేటీఆర్ తీరును తెలంగాణ మహిళలందరూ గమనించాలి" అని ఆమె కోరారు.

అనంతరం హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు. "నిశ్శబ్ద విప్లవం అని హరీశ్ రావు ప్రగల్భాలు పలుకుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మాట అన్నారు. కానీ ఆ నిశ్శబ్ద విప్లవమే మిమ్మల్ని నిండా ముంచింది. నిన్నటి వరకు విషాదంలో ఉన్న ఆయన, ఇప్పుడు హడావుడిగా బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఓటమి భయంతోనే 24 గంటలు గడవకముందే ప్రచారానికి వచ్చారు" అని సీతక్క విమర్శించారు. ఓటమి తప్పదని తెలిసి వాస్తవాలు దాచిపెట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై కూడా సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. "తెలంగాణలో వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియాలతో మీరు విధ్వంసకర పాలన సాగించారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. పదేళ్లలో కనీసం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వని దుష్ట పాలన కేసీఆర్‌ది. మీరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విడిపిస్తోంది" అని అన్నారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం వంటి పథకాలతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా నగరాన్ని ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆమె ఆరోపించారు. 


More Telugu News