భారత్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ షేక్ హసీనా ప్రాణాలను కాపాడింది.. 20 నిమిషాలు ఆలస్యమైతే: పుస్తకంలో సంచలన విషయాలు!

  • బంగ్లాదేశ్‌లో గత ఏడాది హింసాత్మకంగా మారిన రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు
  • విడుదల కాని 'ఇన్షా అల్లా బంగ్లాదేశ్: ది స్టోరీ ఆఫ్ ఆన్ అన్‌ఫినిష్డ్ రెవెల్యూషన్' పుస్తకంలో కీలక విషయాలు
  • అధికారిక భవన్ వైపు మూక వస్తోందని హసీనాను అప్రమత్తం చేసిన భారత ఉన్నతాధికారి
  • తదుపరి పోరాటం కోసం జీవించి ఉండాలని హసీనాకు చెప్పిన ఉన్నతాధికారి
గత ఏడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు జరగడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి తప్పించుకుని భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే సురక్షితంగా ఉంటున్నారు. ముష్కరుల దాడి నుంచి కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఆమె తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ఆమె అక్కడి నుంచి తప్పించుకోవడానికి భారత్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ కారణమని తెలుస్తోంది.

ఆమె ప్రాణాలను కాపాడింది భారత్ నుంచి వచ్చిన ఫోన్ కాలేనని తెలియజేస్తూ ఒక పుస్తకం త్వరలో విడుదల కానుంది. 'ఇన్షా అల్లా బంగ్లాదేశ్: ది స్టోరీ ఆఫ్ ఆన్ అన్‌ఫినిష్డ్ రెవెల్యూషన్' అనే పేరుతో రానున్న ఈ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను పొందుపరిచారు.

గత ఏడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఆ నిరసనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు తీవ్ర హింసాత్మకంగా మారడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి భారత్‌కు వచ్చారు. ఆమె అధికారిక భవనం గణభవన్ నుండి బయటకు వచ్చిన సరిగ్గా 20 నిమిషాలకు నిరసనకారులు అక్కడకు చొచ్చుకువచ్చారు. వారు రావడానికి ముందే ఆమె సురక్షితంగా బయటపడ్డారు.

పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పటికీ, తాను బంగ్లాదేశ్‌ను విడిచి వెళ్లబోనని షేక్ హసీనా కరాఖండీగా చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆమెను బంగ్లాదేశ్ విడిచి వెళ్లేందుకు ఒప్పించాలని సోదరి రెహానా, అమెరికాలో ఉంటున్న ఆమె కుమారుడు వాజీద్‌కు బంగ్లా ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్‌లు సూచించినట్లు సమాచారం. నిరసనకారులు గణభవన్ వైపుకు దూసుకొస్తున్న సమయంలో హసినా ప్రయాణించే విమానానికి తమ గగనతలంలోకి ప్రవేశించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం, 2024 ఆగస్టు 4న మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు భారత్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ ఫోన్ చేసింది హసీనాతో బాగా పరిచయమున్న ఒక ఉన్నతాధికారి అని తెలుస్తోంది. ఆ సంభాషణ చాలా క్లుప్తంగా ముగిసింది.

ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వెంటనే గణభవన్‌ను వీడకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆ అధికారి హసీనాను అప్రమత్తం చేశారని, భవిష్యత్తులో పోరాటం చేయడానికి ప్రాణాలతో ఉండటం ముఖ్యమని సూచించారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ మాటలకు షాక్ తిన్న హసీనా, బంగ్లాదేశ్‌ను వీడాలని నిర్ణయం తీసుకోవడానికి ఆ తర్వాత కూడా అరగంట సమయం తీసుకున్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సందేశాన్ని పూర్తిగా విశ్వసించిన ఆమె, దేశం విడిచి వెళ్ళే ముందు తన ప్రసంగాన్ని రికార్డు చేయాలని భావించారని వెల్లడించారు. అయితే, ముష్కరులు ఏ క్షణమైనా లోపలకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉండటంతో సైన్యాధికారులు ప్రసంగం రికార్డు చేయడానికి అంగీకరించలేదు. అనంతరం సోదరి రెహానా... హసీనాను బలవంతంగా కారులో కూర్చోబెట్టారు.

మధ్యాహ్నం 2.33 గంటల సమయంలో చాపర్ బంగ్లాదేశ్‌లో టేకాఫ్ అయి అరగంటలో భారత్‌లో దిగిందని, అప్పటి నుంచి ఢిల్లీలో ఆమెకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆ పుస్తకం పేర్కొంది. ఆ రోజు భారత్ నుంచి ఫోన్ కాల్ రాకపోతే తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌లాగే హసీనా కూడా హత్యకు గురయ్యేవారని ఆ పుస్తకంలో ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News