జనవరి నుంచి 80 వేలకు పైగా వీసాలను రద్దు చేసిన ట్రంప్ ప్రభుత్వం

  • రెండోసారి అధికారంలోకి రాగానే అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం
  • వీసాలు రద్దైన వారిలో ఉల్లంఘనలకు పాల్పడిన వారు అధికంగా ఉన్నారని కథనం
  • కథనాన్ని ధ్రవీకరించిన శ్వేతసౌధం
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జనవరి నుండి 80 వేలకు పైగా వీసాలను రద్దు చేశారు. ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వీసాలు రద్దైన వారిలో హింస, చోరీ, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరిక వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిని శ్వేతసౌధం కూడా ధ్రువీకరించింది.

ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం అక్రమ వలసదారులను వెనక్కి పంపించే కార్యక్రమం చేపట్టారు. దీంతోపాటు సోషల్ మీడియా వెట్టింగ్‌తో పాటు స్క్రీనింగ్‌ను విస్తృతం చేశారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వీసాల రద్దు భారీగా పెరిగినట్లు ఆ కథనం పేర్కొంది.

రద్దైన వీసాలను పరిశీలిస్తే, మద్యం సేవించి వాహనం నడిపిన వారు 16 వేలు, దాడుల్లో ప్రమేయమున్న వారు 12 వేలు, చోరీ కేసుల్లో 8 వేల మంది ఉన్నట్లుగా సమాచారం. రద్దైన 80 వేల వీసాల్లో విద్యార్థి వీసాలు 8 వేలకు పైగా ఉన్నట్లు కథనం పేర్కొంది. ఈ విషయాన్ని ధ్రవీకరిస్తూ శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.


More Telugu News