రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మహిళ స్వేచ్ఛగా ఆయనను ప్రశ్నించింది: ప్రియాంక గాంధీ

  • మీరు కుళాయి ఏర్పాటు చేయిస్తానని హామీ నెరవేర్చలేదని మహిళ నిలదీసిందని గుర్తు చేసుకున్న ప్రియాంక
  • దేశ ప్రధానితో ఒక గ్రామ మహిళ అలా మాట్లాడిందని వ్యాఖ్య
  • ఈరోజు అలాంటి పరిస్థితి లేదని, ప్రతి ఒక్కరు భయపడాల్సి వస్తోందన్న ప్రియాంక గాంధీ
తన తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేవారని, ఆయనను నేరుగా ప్రశ్నించే స్వేచ్ఛ ఉండేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, తనకు పది, పన్నెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు అమేథిలో ఒక మహిళ తన తండ్రిని నిలదీసిందని గుర్తు చేసుకున్నారు.

ప్రధానమంత్రి అయ్యాక తమకు కుళాయి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని, మీరు ఇంకా దానిని అమలు చేయలేదని, కాబట్టి మీకు ఓటు వేయబోమని ఒక మహిళ నిలదీసిందని తెలిపారు. ఒక దేశ ప్రధానమంత్రితో ఒక గ్రామ మహిళ అలా మాట్లాడారని అన్నారు. రాజీవ్ గాంధీతో అలా మాట్లాడుతున్నందుకు ఆమె ఏమాత్రం భయపడలేదని అన్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు భయపడాల్సి వస్తోందని విమర్శించారు.

ప్రస్తుతం ప్రజలు హక్కుల గురించి మాట్లాడితే పోలీసులు కొట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అవసరమైతే అధికారులు మీ నోరు కూడా మూయిస్తారని, కానీ ఆ రోజుల్లో అలా లేదని పేర్కొన్నారు. మన దేశ రాజకీయాలకు మహాత్మాగాంధీ పునాది వేశారని, అందులో ప్రజలే సుప్రీం అని వెల్లడించారు.

బీహార్ ఎన్నికలు ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగితే ఎన్డీయే అధికారాన్ని కోల్పోతుందని జోస్యం చెప్పారు. బీహార్‌లో 65 లక్షల ఓటర్లను తొలగించారని ఆరోపించారు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లను అదనంగా జోడించారని విమర్శించారు.


More Telugu News