DK Shivakumar: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై డి.కె. శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar on Karnataka Chief Minister Change Speculation
  • రాష్ట్రంలో నాయకత్వ మార్పులను ఖండించిన శివకుమార్
  • పార్టీ గీతను తాను ఎప్పుడూ దాటబోనని స్పష్టీకరణ
  • నవంబర్ విప్లవం ఉండదన్న శివకుమార్
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు వార్తలను ఆయన ఖండించారు. పార్టీ గీతను తాను ఎప్పుడూ దాటబోనని స్పష్టం చేశారు. 'నవంబర్ విప్లవం' ఉండదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీకి ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఉంటానని స్పష్టం చేశారు.

కర్ణాటకలో సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ చెరో రెండున్నరేళ్లు పదవీ కాలాన్ని పంచుకుంటారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. సిద్ధరామయ్య పదవీ కాలం రెండున్నరేళ్లు ముగియనుండటంతో డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై దృష్టి సారించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన వర్గం నాయకులు కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డి.కె. శివకుమార్ మాట్లాడుతూ, "నవంబర్ విప్లవం ఉండదు, డిసెంబర్ విప్లవం ఉండదు. జనవరి లేదా ఫిబ్రవరిలో కూడా ఏమీ ఉండదు. ఏ విప్లవం వచ్చినా 2028లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.

నవంబర్ విప్లవం అంటూ ఎవరో కారణం లేకుండా అలా మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ తమకు ఎన్నో బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. బీహార్ ఎన్నికల బాధ్యతలను కూడా అధిష్ఠానం తమకు అప్పగించిందని అన్నారు. ఇదితప్ప మరో ఇతర విప్లవం లేదని అన్నారు. తన ఢిల్లీ పర్యటనలో తాను ఎవరితోనూ మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడలేదని అన్నారు.

"నాయకత్వ మార్పు గురించి నేను ఏమైనా చెప్పానా? పార్టీ సూచించిన దారిలోనే నడుస్తాం. సిద్ధరామయ్య ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఢిల్లీ నాయకులు ఏం చెబితే అదే చేస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.
DK Shivakumar
Karnataka
Chief Minister
Siddaramaiah
Congress Party
Karnataka Politics

More Telugu News