IND vs AUS: కుప్పకూలిన ఆసీస్.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం

Suryakumar Yadav leads India to victory against Australia in 4th T20
  • 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం
  • భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
  • చివరి 28 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కంగారులు
  • వాషింగ్టన్ సుందర్‌కు మూడు, అక్షర్, దూబేలకు చెరో రెండు వికెట్లు
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఫలితంగా సూర్య సేన‌ 48 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

క్వీన్స్‌లాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (28),  కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 20), అక్షర్ పటేల్ (21), శివమ్ దూబే (22) ప‌రుగుల‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.

అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ఒక దశలో పటిష్ఠంగానే కనిపించిన ఆసీస్, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ప‌రాజ‌యం పాలైంది. ముఖ్యంగా చివరి 28 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ చివర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టగా, ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు. అలాగే అర్ష్‌దీప్ సింగ్‌, బుమ్రా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయాలు కూడా భారత్ విజయానికి దోహదపడ్డాయి. బౌలింగ్ మార్పులు, డీఆర్ఎస్ కాల్స్‌లో అతను చూపిన చురుకుదనం ఫలితాన్నిచ్చింది. సిరీస్‌లో మరొక మ్యాచ్ మిగిలి ఉండగా, భారత్ సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది.
IND vs AUS
Suryakumar Yadav
India vs Australia
T20 series
Indian cricket team
Australia cricket team
Shubman Gill
Axar Patel
Shivam Dube
Washington Sundar

More Telugu News