చీమలతో బతకలేను.. సూసైడ్ నోట్ రాసి మహిళ బలవన్మరణం

  • పటాన్‌చెరు అమీన్‌పూర్‌లో విషాద ఘటన
  • చీమల ఫోబియాతో బాధపడుతున్న వివాహిత ఆత్మహత్య
  • భర్త విధులకు వెళ్లిన సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
  • 'చీమలతో బతకడం నా వల్ల కాదు' అని సూసైడ్ నోట్
  • కూతురిని జాగ్రత్తగా చూసుకోవాలని భర్తకు లేఖ
ఓ వింత ఫోబియా ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. చీమలంటే తీవ్రమైన భయంతో బాధపడుతున్న ఓ వివాహిత తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లోని శర్వా హోమ్స్‌లో శ్రీకాంత్, మనీషా (25) దంపతులు నివసిస్తున్నారు. కొంతకాలంగా మనీషా చీమలంటే తీవ్ర భయంతో (మైర్మెకోఫోబియా) బాధపడుతోంది. ఈ సమస్యను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెకు ఆసుపత్రిలో చికిత్సతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయితే, ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు.

మంగళవారం సాయంత్రం భర్త శ్రీకాంత్ విధులకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్‌రూమ్ తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో ఆందోళన చెంది, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మనీషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మనీషా రాసిన ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. "శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు. కూతురు అన్వి జాగ్రత్త. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చండి" అని లేఖలో రాసి ఉంది. ఈ లేఖ కుటుంబ సభ్యులను కన్నీటిపర్యంతం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News