'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు... ఎందుకో చెప్పిన అల్లు అరవింద్

  • రష్మిక ముఖ్య పాత్రలో 'ది గర్ల్‌ఫ్రెండ్' 
  • రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చిత్రం
  • నవంబరు 7న రిలీజ్
  • హైదరాబాదులో అల్లు అరవింద్ ప్రెస్ మీట్
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కథానాయిక రష్మిక వేరే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వేడుకకు విజయ్ దేవరకొండను ఆహ్వానించాలని భావించామని, కానీ రష్మికే అందుబాటులో లేనప్పుడు ఆయనను పిలవడంలో అర్థం లేదని అల్లు అరవింద్ చమత్కరించారు. "హీరోయిన్ రష్మిక కాబట్టి విజయ్‌ను పిలిస్తే బాగుంటుందనుకున్నాం. కానీ ఆమే రానప్పుడు, విజయ్ వచ్చి ఏం లాభం?" అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంగా 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా గురించి మాట్లాడుతూ, బడ్జెట్ పరంగా ఇది తనకు ఒక రిస్క్ అని అల్లు అరవింద్ అన్నారు. "ప్రతి సినిమా ఒక రిస్కే. ఎంత పెద్ద దర్శకులకైనా విడుదల సమయంలో టెన్షన్ ఉంటుంది" అని పేర్కొన్నారు. అయితే, ఈ చిత్రంలో రష్మిక నటన అద్భుతంగా ఉందని, ఆమెకు జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం తనకు ఉందని ప్రశంసించారు. ఈ సినిమా అందరినీ ఆలోచింపజేస్తుందని తెలిపారు.

ప్రెస్‌మీట్‌కు హాజరు కాలేకపోయిన రష్మిక, సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "మరో సినిమా షూటింగ్‌లో ఉన్నందున రాలేకపోయాను. నా తొలి సోలో చిత్రం కావడంతో 'ది గర్ల్‌ఫ్రెండ్' నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి కథలకు ప్రేక్షకుల మద్దతు అవసరం" అని ఆమె పేర్కొన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సినిమా అద్భుతంగా వచ్చిందని తెలిపారు.

ఈ సమావేశంలో మీడియా అడిగిన ఇతర ప్రశ్నలకు కూడా అల్లు అరవింద్ సమాధానమిచ్చారు. 'సరైనోడు' సీక్వెల్ గురించి స్పందిస్తూ, ఒకవేళ ఆ సినిమా కార్యరూపం దాల్చితే గీతా ఆర్ట్స్ బ్యానర్‌పైనే నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల బండ్ల గణేశ్ చేసిన విమర్శలపై బదులిస్తూ, "నాకంటూ ఒక స్థాయి ఉంది, అందుకే నేను మాట్లాడను" అని సున్నితంగా ఆ విషయాన్ని దాటవేశారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం ఈ శుక్రవారం (నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. 


More Telugu News