వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ షాక్.. దేశంలోకి నో ఎంట్రీ!

  • జకీర్ బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసిన తాత్కాలిక ప్రభుత్వం
  • 2016 ఢాకా దాడి తర్వాత బంగ్లాలో ఆయనపై నిషేధం
  • భారత్‌లో మనీ లాండరింగ్, ఉగ్ర నిధుల కేసుల్లో జకీర్ నాయక్ నిందితుడు
భారత్‌లో మోస్ట్ వాంటెడ్, వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు జకీర్ నాయక్ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారని అక్టోబర్ చివరిలో వార్తలు వచ్చాయి. అయితే, కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ పర్యటనను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.

2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిజన్ కేఫ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు జకీర్ నాయక్ ప్రసంగాల ద్వారానే ప్రేరణ పొందారని దర్యాప్తులో తేలింది. దీంతో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఆయనకు చెందిన పీస్ టీవీ ఛానల్‌ను నిషేధించడంతో పాటు, జకీర్ నాయక్ బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం కూడా పాత నిషేధాన్ని కొనసాగిస్తూ ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.

భారత్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ 2016లో దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి ఆయన మలేషియాలో ఆశ్రయం పొందుతున్నాడు. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించినప్పటికీ... సరైన ఆధారాలు లేవంటూ ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. 


More Telugu News