అమెరికాలో హైదరాబాదీ మహిళ సంచలనం.. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా ఘన విజయం

  • వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతి మహిళ గజాలా హష్మి గెలుపు
  • హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జన్మించిన గజాలా హష్మి
  • వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం, దక్షిణాసియా మహిళ ఈమె
  • 2019లో రాజకీయాల్లోకి వచ్చి అనూహ్య విజయాలు సాధించిన గజాలా
అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన, అందులోనూ హైదరాబాద్ మూలాలున్న మరో మహిళ సత్తా చాటారు. డెమొక్రాట్ పార్టీకి చెందిన గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్‌పై గెలుపొందారు. ఈ విజయంతో గజాలా గతంలో ప్రాతినిధ్యం వహించిన 15వ సెనెటోరియల్ డిస్ట్రిక్ట్ స్థానానికి ఇప్పుడు ప్రత్యేక ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గజాలా హష్మి, అనూహ్య రీతిలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న స్టేట్ సెనేట్ సీటును గెలుచుకుని సంచలనం సృష్టించారు. వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఐదేళ్ల తర్వాత, 2024లో ఆమె సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీకి ఛైర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై మరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

గజాలా హష్మి 1964లో హైదరాబాద్‌లోని మలక్‌పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హష్మి, తన్వీర్ హష్మి. తన నాలుగో ఏట తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు ఆమె వలస వెళ్లారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కాగా, తల్లి తన్వీర్ హష్మి కోఠిలోని ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాలలో చదువుకున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు గజాలా సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి అమెరికన్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆమె భర్త అజహర్ రఫీక్. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్య, వైద్యం, గృహ వసతి, పర్యావరణం వంటి రంగాల్లో అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తానని ఆమె తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.


More Telugu News