విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న మహిళా టీచర్

  • శ్రీకాకుళం గిరిజన పాఠశాలలో టీచర్ నిర్వాకం
  • క్లాస్ రూంలో ఫోన్ మాట్లాడుతూ విద్యార్థినులతో సేవలు
  • విచారణకు ఆదేశించామని తెలిపిన ఉన్నతాధికారులు
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ విద్యార్థినులతో సేవలు చేయించుకుంది.. తరగతి గదిలో కుర్చీలో తీరిగ్గా కూర్చుని ఫోన్ మాట్లాడుతూ పిల్లలతో కాళ్లు నొక్కించుకుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీచర్ నిర్వాకంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతోందని, ఆలస్యంగా వీడియో బయటకు రావడంతో టీచర్ నిర్వాకం వెలుగు చూసిందని విద్యార్థినులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ స్పందిస్తూ.. ఆ టీచర్ కు ఇప్పటికే షోకాజ్‌ నోటీసు జారీ చేశామని తెలిపారు. విద్యార్థినులతో టీచర్ కాళ్లు పట్టించుకున్న ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వివరించారు.


More Telugu News