జూబ్లీహిల్స్‌లో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో జోస్యం చెప్పిన పొన్నం ప్రభాకర్

  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారన్న పొన్నం
  • బీజేపీని బీఆర్ఎస్-2గా మార్చేశారని తీవ్ర విమర్శలు
  • జూబ్లీహిల్స్‌లో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావని సవాల్
కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌తో నేరుగా కుమ్మక్కయ్యారని, బీజేపీ వ్యవస్థను 'బీఆర్ఎస్-2'గా మార్చేసి వారికి హ్యాండోవర్ చేశారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి ప్రచార సరళి "దింపుడు గళ్లం ఆశ"లా ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 10 వేల ఓట్ల కంటే ఎక్కువ రావని తాను సవాల్ విసురుతున్నట్లు పొన్నం  స్పష్టం చేశారు. "గత ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ మద్దతు తీసుకున్నారు. ఇప్పుడు దానికి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌కు లోపాయికారీగా మద్దతు తెలుపుతున్నారని జూబ్లీహిల్స్‌లో బహిరంగంగా చర్చ జరుగుతోంది" అని పొన్నం అన్నారు.

కేంద్ర మంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా పదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఏం చేశారో చెప్పగలరా? అని పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు.

"ఇప్పటికైనా కిషన్ రెడ్డి నిజాయతీగా వ్యవహరించాలి. సొంత పార్టీ అభ్యర్థిని మోసం చేయకుండా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నట్టుగా నిబద్ధతతో పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాను" అని పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఈ ఆరోపణలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి. 


More Telugu News