"ప్రతి రోజు వేదనే" అంటున్న ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు

  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక వ్యక్తి
  • 260 మంది మరణించగా ప్రాణాలతో మిగిలిన విశ్వాస్ కుమార్ రమేశ్
  • ప్రమాదంలో తన వెన్నెముక లాంటి సోదరుడిని కోల్పోయిన వైనం
  • బతకడం అద్భుతమే అయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఆవేదన
  • తీవ్రమైన పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి
  • ఎయిర్ ఇండియా ఇచ్చిన పరిహారం సరిపోదని అసంతృప్తి
చాలామంది దృష్టిలో అతను "ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు". కానీ 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేశ్ కు మాత్రం ఆ అదృష్టమే ఒక శాపంగా మారింది. 260 మందిని బలిగొన్న ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి అతనే. ఆ ఘటనలో బతకడం ఒక అద్భుతమే అయినా, ఆ జ్ఞాపకాలతో జీవించడం మాత్రం నరకంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్) టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది, కింద ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేశ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆయన తమ్ముడు అజయ్ ఈ దుర్ఘటనలో మరణించారు.

"ఆ ప్రమాదంలో బతికింది నేను ఒక్కడినే. ఇప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా ఒక అద్భుతం. కానీ నా సోదరుడిని కోల్పోయాను. అతడు నాకు వెన్నెముక లాంటివాడు. గడిచిన కొన్నేళ్లుగా నాకు అండగా నిలిచాడు," అని భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడైన రమేశ్ బీబీసీతో మాట్లాడుతూ ఆవేదన చెందారు. టేకాఫ్ అయిన వెంటనే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికలో పేర్కొంది.

ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని, విమానం మంటల గోళంలా మారి హాస్టల్ భవనంపై పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే, ఒంటినిండా మసితో, దిగ్భ్రాంతిలో రమేశ్ నడుచుకుంటూ రావడం అక్కడి వీడియోలలో రికార్డయింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజే ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రిలో రమేష్‌ను పరామర్శించారు. తాను ఎలా బతికానో కూడా తెలియదని అప్పుడు ప్రధానికి చెప్పినట్లు రమేశ్ గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం లీసెస్టర్‌లోని తన ఇంట్లో ఉంటున్న రమేశ్, ఆనాటి భయంకర జ్ఞాపకాలతో మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు తెలిపారు. "ఇప్పుడు నేను ఒంటరినయ్యాను. నా గదిలో ఒంటరిగా కూర్చుంటున్నాను. నా భార్యతో, కొడుకుతో కూడా మాట్లాడటం లేదు. మా అమ్మ నాలుగు నెలలుగా ఇంటి గుమ్మం వద్దే మౌనంగా కూర్చుంటోంది. ఆ ఘటన గురించి ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. రాత్రంతా అవే ఆలోచనలు, మానసికంగా కుంగిపోతున్నాను," అని బీబీసీకి వివరించారు.

రమేశ్ పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)తో బాధపడుతున్నారని, సరిగ్గా నడవలేకపోతున్నారని ఆయన శ్రేయోభిలాషులు తెలిపారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా మధ్యంతర పరిహారంగా రూ. 22 లక్షలు (21,500 పౌండ్లు) అందించిందని, అయితే ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు అంటున్నారు.


More Telugu News