ప్రపంచ కప్ గెలిచిన మహిళా జట్టుకు వజ్రాల ఆభరణాలు బహుమతిగా ఇవ్వనున్న వ్యాపారవేత్త

  • మహిళా భారత జట్టు సభ్యులకు ప్రత్యేక కానుకలు ప్రకటించిన గోవింద్ ఢోలాకియా
  • జట్టు సభ్యులందరికీ వజ్రాల అభరణాలు, సోలార్ ప్యానెళ్లను అందజేస్తానని వెల్లడి
  • మహిళా జట్టు కప్ గెలిస్తే బహుమతులు ఇస్తానని ముందే ప్రకటించిన ఎంపీ
మహిళల వన్డే ప్రపంచ కప్ తొలిసారి గెలిచిన భారత జట్టు సభ్యులకు సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలాకియా ప్రత్యేక కానుకలు ప్రకటించారు. మహిళా జట్టుకు వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు గోవింద్ ఢోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ప్రపంచ టోర్నీలో ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, ఒకవేళ మన అమ్మాయిలు కప్ సాధిస్తే జట్టులోని సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే సోలార్ ప్యానెళ్లను కూడా ఇస్తానని తెలిపారు. దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలుగుమయం కావాలని ఆకాంక్షించారు.

కప్ గెలిచిన నేపథ్యంలో గోవింద్ ఢోలాకియా బహుమతులు ఇవ్వనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. త్వరలో వారందరికీ తన తరఫున వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానెళ్లను అందిస్తానని ప్రకటించారు. శ్రీరామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన ఢోలాకియా గతంలోనూ పలుమార్లు ఇలా అరుదైన కానుకలు ఇచ్చారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఉద్యోగులకు బహుమతులు ఇస్తుంటారు.


More Telugu News