Pattabhi Ram Kommareddy: జోగి రమేశ్ ను సస్పెండ్ చేయగలరా?: జగన్‌కు పట్టాభి సవాల్

Pattabhi Challenges Jagan to Suspend Jogi Ramesh
  • అన్ని ఆధారాలతోనే జోగి రమేశ్ ను అరెస్ట్ చేశారన్న పట్టాభి
  • వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్ కొత్త నాటకాలు అని విమర్శ
  • జగన్ కుటుంబానికే నకిలీ మద్యం కమీషన్లు అని ఆరోపణ
మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం జగన్‌కు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు. ములకలచెరువు మద్యం కేసులో ఆరోపణలు రాగానే తమ పార్టీ నేత జయచంద్రారెడ్డిని టీడీపీ తక్షణమే సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. టీడీపీకి, వైసీపీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించేందుకే జగన్‌ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. పక్కా ఆధారాలతోనే జోగి రమేశ్ ను అధికారులు అరెస్ట్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని తెలిపారు. ఈ కేసులో నిందితులైన అద్దేపల్లి సోదరులతో జోగి రమేశ్ జరిపిన ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాటింగ్‌లు వాస్తవం కాదా? అని పట్టాభి నిలదీశారు.

"నకిలీ మద్యం దందా ద్వారా వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు దండుకున్నది నిజం కాదా? విదేశాల్లో నడిపిన దందాను ఇక్కడ కూడా అమలు చేయడానికి శిక్షణ ఇచ్చి, నకిలీ మద్యం తయారు చేయించింది వాస్తవం కాదా?" అని పట్టాభి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మొత్తం వ్యవహారం జగన్ కుటుంబ సభ్యులకు కమీషన్లు ముట్టజెప్పడానికే సాగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నైతిక విలువలు ఉంటే తక్షణమే జోగి రమేశ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
Pattabhi Ram Kommareddy
Jogi Ramesh
YS Jagan Mohan Reddy
Fake liquor case
Andhra Pradesh politics
TDP
YSRCP
Mulakalacheruvu
Adepalli brothers
Corruption

More Telugu News