Louvre Museum: ఫ్రాన్స్‌లో రూ. 895 కోట్ల ఆభరణాల చోరీ.. చిల్లర దొంగల పనే అన్న అధికారులు

Louvre Museum Jewelry Theft in France Was Petty Crime Say Officials
  • లవ్రే మ్యూజియంలో అక్టోబర్ 19న భారీ దొంగతనం
  • కరుడుగట్టిన ముఠాకు చెందిన ప్రొఫెషనల్స్ చేయలేదన్న పారిస్ ప్రాసిక్యూటర్
  • నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడి
ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో నిమిషాల వ్యవధిలో రూ. 895 కోట్ల విలువైన ఆభరణాల చోరీ సంచలనం రేపింది. ఈ కేసులో తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చోరీ చేసింది సాధారణ దొంగల ముఠా అని పారిస్ ప్రాసిక్యూటర్ లారే బేకువా వెల్లడించారు. పారిస్‌లో అత్యంత భద్రత కలిగిన లవ్రే మ్యూజియంలో అక్టోబర్ 19న ఈ భారీ దొంగతనం జరిగింది.

ఈ దోపిడీని కరుడుగట్టిన నేరస్తుల ముఠా చేయలేదని, సాధారణ నేరాలకు పాల్పడేవారే ఈ పని చేసి ఉంటారని పారిస్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నేర చరిత్రను పరిశీలిస్తే వారు వ్యవస్థీకృత ముఠాకు చెందిన దొంగలుగా కనిపించడం లేదని అన్నారు.

వారు గతంలో శివారు ప్రాంతాల్లో చిన్న చిన్న నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయని తెలిపారు. అరెస్టయిన వారంతా స్థానికులేనని, వారిలో ఒక మహిళ కూడా ఉందని పారిస్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.

పరారీలో ఉన్న నాలుగవ అనుమానితుడి కోసం గాలిస్తున్నట్లు ఫ్రాన్స్ హోం మంత్రి లారెన్ నిజ్ తెలిపారు. దోపిడీకి ప్రధాన సూత్రధారి అతడే అయి ఉంటాడని పేర్కొన్నారు. చోరీ అనంతరం దుండగులు ఒక వజ్రాల కిరీటాన్ని అక్కడే వదిలి వెళ్లారని, దొంగతనానికి ఉపయోగించిన కొన్ని పరికరాలు, గ్లోవ్స్ ను కూడా వదిలేసి పరారయ్యారని చెప్పారు. అక్కడి పరిస్థితులను చూస్తే ఇది వ్యవస్థీకృత ముఠా పనిగా కనిపించడం లేదని అన్నారు.

అక్టోబర్ 19న పారిస్‌లోని లవ్రే మ్యూజియంలో చోరీ జరిగింది. మ్యూజియంలో ఒకవైపు నిర్మాణం జరుగుతుండగా, అక్కడి నుంచి దుండగులు లోపలకి ప్రవేశించారు. నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దం పగులగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగిలించారు. ఈ ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 895 కోట్లు.
Louvre Museum
France jewelry theft
Paris
robbery
French police
jewelry heist
organized crime

More Telugu News