Revanth Reddy: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో రాజకీయం తగదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy says no to politics regarding SLBC Tunnel
  • టన్నెల్ పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్న రేవంత్ రెడ్డి
  • టన్నెల్ బోర్ మిషన్‌తో పనులు పూర్తి చేయడం కష్టంగా మారిందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ హయాంలో 10 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శ
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లెలో పర్యటించిన ముఖ్యమంత్రి, హెలీ మాగ్నటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్, ఆధునాతన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు.

టన్నెల్ బోర్ మిషన్‌తో పనులు చేయడం కష్టంగా మారిందని అన్నారు. ఈ పనులపై రాజకీయం చేయవద్దని కోరారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని అన్నారు. ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు పనుల అంచనా విలువ రూ. 1,986 కోట్లు అని, రెండు దశాబ్దాల్లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదన్నరేళ్లలో 10 కిలోమీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పెద్దగా కమీషన్లు రావని ఈ టన్నెల్‌ను పక్కకు పెట్టారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ అప్పుడు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీరు అందేదని చెప్పారు. కృష్ణానది మీద చెపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు రూ. 1.86 లక్షల కోట్లు చెల్లించారని, ఆ మొత్తంలో కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ. 1.06 లక్షల కోట్లు చెల్లించారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తే, కేసీఆర్ మాత్రం ఏమీ నిర్మించలేకపోయారని మండిపడ్డారు.
Revanth Reddy
SLBC Tunnel
Telangana
Nagar Kurnool
BRS Politics
Irrigation Projects
Kaleshwaram Project

More Telugu News