TGSRTC: గూగుల్ మ్యాప్స్‌లోనే ఆర్టీసీ టికెట్లు.. బస్సుల్లో 'ట్యాప్ అండ్ పే'.. టీజీఎస్ఆర్టీసీ కీలక అడుగులు

TGSRTC Revolutionizing Bus Ticketing with Technology Advancements
  • గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం
  • రిజర్వేషన్, సాధారణ బస్సులకూ వర్తించనున్న కొత్త విధానం
  • రెండు, మూడు వారాల్లో అందుబాటులోకి రానున్న సేవలు
  • బస్సుల్లో పిన్ లేకుండా 'ట్యాప్ అండ్ పే' ద్వారా చెల్లింపులు
  • వారంలోగా ఎయిర్‌పోర్టు బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. బస్సు టికెట్ల కోసం కౌంటర్ల వద్ద బారులు తీరే అవసరం లేకుండా, నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని, బస్సుల్లో పిన్ అవసరం లేకుండానే చెల్లింపులు చేసే విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ రెండు మార్పులతో ఆర్టీసీ ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ప్రస్తుతం ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా బస్టాండ్లలోని కౌంటర్ల ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, త్వరలో రాబోయే కొత్త విధానం ప్రకారం ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ మ్యాప్స్‌లో తాము వెళ్లాల్సిన ప్రాంతాన్ని ఎంటర్ చేస్తే చాలు. ఆ మార్గంలో అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సుల వివరాలు కనిపిస్తాయి. నచ్చిన బస్సును ఎంచుకుని, అక్కడే ఆన్‌లైన్‌లో ఛార్జీ చెల్లించి తక్షణమే ఈ-టికెట్ పొందవచ్చు. రిజర్వేషన్ ఉన్న బస్సులతో పాటు, పల్లె వెలుగు వంటి సాధారణ సర్వీసులకు కూడా ఈ సదుపాయం వర్తించనుంది.

ఈ ప్రాజెక్టు కోసం పల్లె వెలుగు నుంచి అంతర్రాష్ట్ర సర్వీసుల వరకు అన్ని బస్సుల వివరాలను ఆర్టీసీ సిద్ధం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని ఐటీ శాఖ ద్వారా గూగుల్‌కు అందించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, మరో రెండు, మూడు వారాల్లో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మొదట హైదరాబాద్ సిటీ బస్సులతో ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా జిల్లాల బస్సుల వివరాలను కూడా గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించనున్నారు.

బస్సుల్లో పిన్ లెస్ చెల్లింపులు
టికెట్ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ 'ట్యాప్ అండ్ పే' విధానాన్ని తీసుకురానుంది. ప్రస్తుతం బస్సుల్లో కండక్టర్ల వద్ద ఉన్న టిమ్ యంత్రాల ద్వారా కార్డుతో చెల్లించాలంటే పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో ఇది ఆలస్యానికి కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, కార్డును టిమ్ యంత్రంపై ట్యాప్ చేయగానే పిన్ అవసరం లేకుండానే చెల్లింపు పూర్తయ్యేలా కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. వారంలోగా ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తొలుత హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టు ఏసీ బస్సుల్లో ప్రారంభించనున్నారు. అనంతరం సిటీ బస్సులు, దూరప్రాంత సర్వీసులకు కూడా విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. ఈ నూతన మార్పులతో ఆర్టీసీ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా మారనున్నాయి.
TGSRTC
TSRTC
Telangana RTC
Google Maps
Bus Tickets
Online Booking
Tap and Pay
Pinless Payments
Hyderabad Buses
RTC Services

More Telugu News