Time Bank Project: ఏమిటీ టైమ్ బ్యాంక్ ప్రాజెక్ట్... వృద్ధులకు ఎలాంటి సేవలు అందుతాయి?

Time Bank Project Kerala Provides Services for Elderly
  • కేరళలో వృద్ధుల కోసం వినూత్నంగా 'టైమ్ బ్యాంక్' ఏర్పాటు
  • తలస్సేరి ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించిన వెబ్‌సైట్, యాప్
  • ప్రస్తుతం 21 పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు
వృద్ధులకు అండగా నిలిచేందుకు కేరళ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. సమాజంలో వృద్ధులకు చేయూతనిస్తూ, వారి ఒంటరితనాన్ని దూరం చేసే లక్ష్యంతో 'టైమ్ బ్యాంక్' అనే సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. కేరళ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ (కే-డీఐఎస్‌సీ), తలస్సేరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ పథకం కింద ఎవరైనా వాలంటీర్లుగా వృద్ధులకు సేవ చేస్తే, ఆ సేవా సమయాన్ని వారి పేరు మీద బ్యాంకులో జమ చేస్తారు. భవిష్యత్తులో వారికి అవసరమైనప్పుడు ఆ జమ అయిన సమయాన్ని ఉపయోగించుకుని ఇతరుల నుంచి సేవలు పొందవచ్చు.

ఎలా పనిచేస్తుంది?

ఈ వ్యవస్థ కోసం తలస్సేరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. సాయం అవసరమైన వృద్ధులు తమ పేరు, ఫోన్ నంబర్, చిరునామా వంటి వివరాలతో ఇందులో నమోదు చేసుకోవాలి. వారికి ఇంటిపని, వంట, షాపింగ్, ఆస్పత్రికి వెళ్లడం లేదా కాసేపు తోడుగా మాట్లాడటం వంటి ఎలాంటి సేవ కావాలో ఎంచుకుని, సమయం, తేదీని నిర్ణయించుకోవచ్చు.

రిక్వెస్ట్ పంపగానే, వారి సమీపంలో అందుబాటులో ఉన్న వాలంటీర్ల జాబితా కనిపిస్తుంది. వారిలో ఒకరిని ఎంచుకోగానే, ఆ వాలంటీర్‌కు సమాచారం వెళ్తుంది. అత్యవసర పరిస్థితుల కోసం 'ఎమర్జెన్సీ కాల్' ఫీచర్‌ను కూడా పొందుపరిచారు. దీనిపై క్లిక్ చేస్తే సమీపంలోని పాలియేటివ్ కేర్ సెంటర్‌కు వెంటనే సమాచారం చేరి, తక్షణ సహాయం అందుతుంది.

భవిష్యత్తుకు భరోసా

వృద్ధులకు సేవ చేసిన వాలంటీర్లు, తాము ఎంత సమయం సేవ చేశారో ఆ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆ సమయం 'టైమ్ క్రెడిట్స్' లేదా 'టైమ్ డాలర్ల' రూపంలో వారి ఖాతాలో జమ అవుతుంది. భవిష్యత్తులో తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు సహాయం అవసరమైనప్పుడు ఈ క్రెడిట్లను వాడుకుని ఇతరుల నుంచి ఉచితంగా సేవలు పొందవచ్చు. ఈ ప్రాజెక్ట్ వృద్ధుల్లో ఒంటరితనాన్ని తగ్గించడమే కాకుండా, సమాజంలో పరస్పర సహకార స్ఫూర్తిని పెంపొందిస్తుంది. ప్రభుత్వం, విద్యాసంస్థలు, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం కేరళలోని 21 పంచాయతీల్లో ఈ ప్రాజెక్టును పైలట్ దశలో అమలు చేస్తున్నారు. 
Time Bank Project
Kerala government
elderly care
K-DISC
Thalassery Engineering College
volunteer services
old age support
social service
India
senior citizens

More Telugu News