Andhra Pradesh: అత్తకు తలకొరివి పెట్టిన కోడలు.. కోనసీమలో కంటతడి పెట్టిస్తున్న ఘటన

Konaseema Woman Sridevi Performs Final Rites for Her Mother in Law
  • కోనసీమ జిల్లాలో హృదయవిదారక ఘటన
  • భర్త, కుమారుడిని కోల్పోయిన వృద్ధురాలు
  • అత్తను కంటికి రెప్పలా చూసుకున్న కోడలు
  • వృద్ధురాలు ఆకస్మిక మృతితో కీలక నిర్ణయం
  • మగదిక్కు లేకపోవడంతో కోడలే తలకొరివి
  • స్థానికంగా కంటతడి పెట్టిస్తున్న అత్తాకోడళ్ల బంధం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొడుకు లేని లోటును తీరుస్తూ, ఓ కోడలు తన అత్తకు తలకొరివి పెట్టింది. భర్త, కుమారుడు దూరమైన అత్తకు ఇన్నాళ్లూ అండగా నిలిచిన ఆ కోడలే.. చివరకు అంతిమ సంస్కారాలు నిర్వహించి తన బాధ్యతను చాటుకుంది. ఈ సంఘటన స్థానికులను తీవ్రంగా కదిలించింది.

వివరాల్లోకి వెళితే... ముమ్మిడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త చాలాకాలం క్రితమే మరణించాడు. ఆమె ఏకైక కుమారుడు కూడా మూడేళ్ల క్రితం కన్నుమూశాడు. అప్పటి నుంచి కోడలు శ్రీదేవి, ఆమె ఇద్దరు పిల్లలు (ఏడేళ్ల మనవరాలు, నాలుగేళ్ల మనవడు) ఆదిలక్ష్మికి తోడుగా ఉంటున్నారు. శ్రీదేవి తన అత్తను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చింది.

ఈ క్రమంలో ఆదివారం ఆదిలక్ష్మి అకస్మాత్తుగా మృతి చెందింది. ఇంట్లో మగదిక్కు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు ఎవరు నిర్వహించాలనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితుల్లో, అత్తకు తానే కొడుకుగా మారాలని శ్రీదేవి నిర్ణయించుకుంది. అంతిమయాత్రలో పాల్గొని, శాస్త్రోక్తంగా చితికి నిప్పుపెట్టింది.

కొడుకు స్థానంలో నిలిచి అత్త రుణం తీర్చుకున్న కోడలిని చూసి స్థానికులు చలించిపోయారు. అత్తాకోడళ్ల మధ్య ఉన్న ఈ అనుబంధం అందరి హృదయాలను కదిలించింది.
Andhra Pradesh
Sridevi
Konaseema
daughter-in-law
funeral rites
bereavement
grief
Hindu rituals
CH Gunnepalli
Adilakshmi

More Telugu News