మరో ప్రమాదకర అస్త్రాన్ని బయటికి తీసిన రష్యా

  • రష్యా నుంచి మరో శక్తిమంతమైన అణు జలాంతర్గామి
  • 'డూమ్స్‌డే' క్షిపణిగా పిలిచే పోసిడాన్ డ్రోన్‌తో ఆయుధం
  • యావత్ తీర దేశాలను నాశనం చేయగలదని హెచ్చరిక
  • గత 12 రోజుల్లో రష్యాకు ఇది మూడో ప్రధాన ఆయుధ ప్రయోగం
ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తూ రష్యా తన అణ్వాయుధ సంపత్తిని నిరంతరం పెంచుకుంటోంది. తాజాగా 'ఖబరోవ్స్క్' అనే మరో శక్తిమంతమైన అణు జలాంతర్గామిని జలప్రవేశం చేయించింది. దీనికి అత్యంత ప్రమాదకరమైన 'పోసిడాన్' అణు డ్రోన్‌ను అమర్చడం గమనార్హం. యావత్ తీరప్రాంత దేశాలను నాశనం చేయగల సామర్థ్యం దీనికి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే దీనిని "డూమ్స్‌‌డే క్షిపణి" (ప్రళయాన్ని సృష్టించే ఆయుధం) అని పిలుస్తున్నారు.
 
ఈ జలాంతర్గామిని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మొయిసేవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెలౌసోవ్ మాట్లాడుతూ, రష్యాకు ఇది చాలా ముఖ్యమైన రోజని, ఈ కొత్త జలాంతర్గామి దేశ సముద్ర సరిహద్దుల భద్రతను మరింత పటిష్ఠం చేస్తుందని తెలిపారు.
 
 పోసిడాన్ డ్రోన్ ప్రత్యేకతలు
 
రష్యా ఇటీవల నీటి అడుగున పోసిడాన్ డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇది సాధారణ జలాంతర్గాములు, టార్పెడోల కంటే చాలా వేగంగా ప్రయాణించగలదు. సముద్ర గర్భంలో లోతుగా, ఎక్కువ దూరం ప్రయాణించి సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఖబరోవ్స్క్-తరగతి జలాంతర్గాములపై మోహరించడానికే రష్యా ఈ డ్రోన్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్, డూమా రక్షణ కమిటీ ఛైర్మన్ ఆండ్రీ కర్తపోలోవ్ వంటి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఈ డ్రోన్ తీర దేశాలను నాశనం చేయగలదని బహిరంగంగానే ప్రకటించారు.
 
 భారత్‌కు పరిచయమున్న షిప్‌యార్డ్‌‌లోనే నిర్మాణం
 
ఈ జలాంతర్గామిని రూబిన్ సెంట్రల్ డిజైన్ బ్యూరో ఆఫ్ మెరైన్ ఇంజినీరింగ్ రూపొందించింది. భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను పునరుద్ధరించిన సెవ్‌మాష్ షిప్‌యార్డ్‌ లోనే దీనిని నిర్మించారు. ఆధునిక ఆయుధాలు, రోబోటిక్ పరికరాలతో దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత 12 రోజుల్లో రష్యా మూడు ప్రధాన ఆయుధ పరీక్షలు నిర్వహించడం గ్లోబల్ భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోసిడాన్ డ్రోన్‌లోని అణు రియాక్టర్, వ్యూహాత్మక జలాంతర్గాముల్లోని రియాక్టర్ కంటే 100 రెట్లు చిన్నదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొనడం దాని సాంకేతిక ఆధిక్యతకు నిదర్శనం.


More Telugu News