మహిళల వరల్డ్ కప్ ఫైనల్... టీమిండియాకు ఏపీ సర్కారు సపోర్ట్

  • మహిళల వరల్డ్ కప్ ఫైనల్
  • టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • ఏపీలోని వివిధ పట్టణాల కూడళ్లలో డిజిటల్ స్క్రీన్లు!
  • టీమిండియాకు ఏపీ సర్కార్ మద్దతు
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక పోరులో భారత జట్టుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు, భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ఈ ఏర్పాట్లలో కొన్ని చోట్ల స్థానిక కూటమి నేతలు సైతం పాలుపంచుకుంటూ అభిమానులకు మ్యాచ్ చూసే సౌకర్యం కల్పిస్తున్నారు.

నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు అద్భుతంగా రాణించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. తాజా సమాచారం అందేసరికి 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ షఫాలీ వర్మ తన స్లో స్పిన్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టింది.

ప్రస్తుతం క్రీజులో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (65), సినాలో జాఫ్తా (2) ఉన్నారు. సఫారీ జట్టు విజయానికి ఇంకా 26 ఓవర్లలో 174 పరుగులు చేయాల్సి ఉండగా, వారి చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.


More Telugu News