ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబు... నవంబర్ 22న గ్రాండ్ ఈవెంట్

  • సినీ రంగంలో మోహన్ బాబు స్వర్ణోత్సవం..
  • 'MB50' వేడుకకు భారీగా ఏర్పాట్లు
  • చారిత్రక ఘట్టంగా నిలిచిపోయేలా ఉంటుందన్న మంచు విష్ణు
ప్రముఖ నటుడు మోహన్ బాబు సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఐదు దశాబ్దాల ఈ అసాధారణ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆయనకు ఘన సత్కారం చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నవంబర్ 22న ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు, నటుడు మంచు విష్ణు ప్రకటించారు. భారతీయ సినిమాకు మోహన్ బాబు అందించిన సేవలను గౌరవిస్తూ, ఈ వేడుకను ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

1975లో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు, తన విలక్షణ నటన, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 600కు పైగా చిత్రాలలో నటించి 'కలెక్షన్ కింగ్'గా పేరు తెచ్చుకున్నారు. క్రమశిక్షణ, కళ పట్ల అంకితభావంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్వయంకృషితో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.

‘MB50’ కార్యక్రమం కేవలం ఆయన సినీ విజయాలకు మాత్రమే కాకుండా, విద్య, సేవా రంగాలలో ఆయన చేసిన కృషికి కూడా ఒక నివాళిగా నిలవనుందని విష్ణు తెలిపారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా వేలాది మందికి విద్యను అందిస్తూ, దాతృత్వంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. ఈ స్వర్ణోత్సవ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని విష్ణు పేర్కొన్నారు. 


More Telugu News