మెక్సికో సూపర్ మార్కెట్లో పేలుడు.. 23 మంది మృతి

  • మృతుల్లో 8 మంది మైనర్లు, ఇద్దరు గర్భిణీలు.. మరో 12 మందికి తీవ్ర గాయాలు
  • హెర్మోసిల్లోలోని వాల్డో సూపర్ మార్కెట్లో ఘోరం
  • పేలుడు ధాటికి ఎగిసిపడ్డ మంటలు.. ఒక కారు దగ్ధం
మెక్సికోలోని హెర్మోసిల్లో సిటీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక సూపర్ మార్కెట్లో శనివారం బాంబు పేలింది.  దీంతో సూపర్ మార్కెట్ భవనంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది మైనర్లు, ఇద్దరు గర్భిణీలు సహా పలువురు వృద్ధులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు.

సూపర్ మార్కెట్లో ఎగిసిపడ్డ మంటలు విస్తరించడంతో బిల్డింగ్ ముందున్న పార్కింగ్ ప్లేస్ లోని ఓ కారు దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై సోనోరా రాష్ట్ర గవర్నర్‌ అల్ఫోన్సో డురాజో స్పందించారు. ప్రమాద ఘటనపై అల్ఫోన్సో ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు.

ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాద ఘటన తనను కలచివేసిందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె తన సానుభూతిని వ్యక్తం చేశారు.


More Telugu News