AP GST: పన్నులు తగ్గినా పెరిగిన ఏపీ జీఎస్‌టీ ఆదాయం.. అక్టోబర్‌లో 8.77శాతం వృద్ధి

AP GST Revenue Increased Despite Tax Cuts
  • నికరంగా రూ.3,021 కోట్లకు చేరిన ఆదాయం
  • డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధస్సుతో పన్ను ఎగవేతలకు చెక్
  • అన్ని విభాగాల్లో కలిపి ప్రభుత్వానికి రూ.4,458 కోట్ల రాబడి
  • ప్రభుత్వ సమర్థ పాలనే కారణమన్న పన్నుల శాఖ కమిషనర్ బాబు ఏ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 అక్టోబర్ నెలకు గాను నికర జీఎస్టీ వసూళ్లలో 8.77 శాతం పెరుగుదల కనిపించింది. వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్ వంటి పలు కీలక వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ ఈ స్థాయిలో వృద్ధి సాధించడం గమనార్హం.

రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అక్టోబర్ నెలలో నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,021 కోట్లుగా నమోదయ్యాయి. ఇది అక్టోబర్ నెల వసూళ్లలో ఇప్పటివరకు రెండో అత్యధికం. ఇక స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,490 కోట్లకు చేరాయి. రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్జీఎస్టీ) రూపంలో రూ.1,247 కోట్లు (6.2 శాతం వృద్ధి), ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్ ద్వారా రూ.1,773 కోట్లు (10.65 శాతం వృద్ధి) సమకూరాయి. వీటితో పాటు పెట్రోలియం వ్యాట్ ద్వారా రూ.1,282 కోట్లు, వృత్తిపన్ను ద్వారా 18.26 శాతం వృద్ధి నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్‌టీ 2.0 సంస్కరణలు, పటిష్టమైన పన్నుల అమలు విధానాల వల్లే ఈ వృద్ధి సాధ్యమైందని అధికారులు విశ్లేషిస్తున్నారు. పన్ను ఎగవేతలను గుర్తించేందుకు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) క్లెయిమ్‌లను అరికట్టడం, బకాయిదారులపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించడం, వారి ఆస్తులు, బ్యాంకు ఖాతాల నుంచి పన్నులు వసూలు చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే రూ.279 కోట్ల తప్పుడు ఐజీఎస్‌టీ క్రెడిట్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

అక్టోబర్ నెలలో అన్ని పన్నుల రూపంలో ప్రభుత్వానికి మొత్తం రూ.4,458 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.4,126 కోట్లతో పోలిస్తే ఇది 8.03 శాతం అధికం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రతినెలా వసూళ్లు గతేడాది కంటే మెరుగ్గా ఉన్నాయని కమిషనర్ తెలిపారు. సమర్థవంతమైన పన్నుల పరిపాలన, డేటా ఆధారిత పర్యవేక్షణ, పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం వల్లే ఈ సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆయన వివరించారు. 
AP GST
Andhra Pradesh GST
GST Revenue
GST Collections
Tax Revenue
IGST
SGST
AP Tax Revenue
Goods and Services Tax
Tax Evasion

More Telugu News